కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి నగరం సోమవారం మహా కుంభ ఆప్ టెంపుల్స్ పేరిట ప్రారంభమైన సదస్సుతో ప్రత్యేక శోభను సంతరిచుకుంది. ఈ సభా వేదికగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ఇతర దేశాలకు చెందిన నగరాల్లోనూ వెంకన్న ఆలయాలను నిర్మిస్తామని కూడా ఆయన ప్రకటించారు.
ఇంటర్నేషనల్ టెంపుల్స్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ ఎక్స్ పో సంస్థ నిర్వహించిన ఈ సదస్సుకు చంద్రబాబుతో పాటుగా మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్ లు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక ప్రసంగం చేసిన చంద్రబాబు… ఆధునిక సాంకేతికతను ఆలయాల నిర్వహణకు వినియోగించుకునే విషయంపై సమగ్ర చర్చ జరగడం ఆహ్వానించదగ్గ విషయమని తెలిపారు. ఏపీలోని ఆలయాల నిర్వహణను తమ ప్రభుత్వం పకడ్బందీగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.
ఆయా ఆలయాల ప్రాశస్త్యాన్ని కాపాడటంతో పాటుగా ఆలయాల విశిష్టతను భావి తరాలకు అందేలా చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆలయాలను స్వయం సమృద్ధం చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఆలయాల ట్రస్ట్ బోర్డులను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో దైవ భక్తిని పెంపొందించడంతో పాటుగా టెంపుల్ టూరిజాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో అమ్మవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం కోసం స్థలాన్ని కేటాయించాలని కోరుతూ టీటీడీ తరఫున మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు చంద్రబాబు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates