ఆ ‘ఒక్క‌టీ’ ఏమైంది? మంత్రుల‌కు బాబు క్లాస్‌!

ఏపీలో అందుబాటులో ఉన్న మంత్రుల‌తో సీఎం చంద్ర‌బాబు తాజాగా టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కొంద‌రు మంత్రులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ ఒక్క‌టి ఏమైంది? అంటూ.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన మంత్రులు, నాయ‌కుల‌ను ఉద్దేశించి.. చంద్ర‌బాబు ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగుకు స‌మ‌యం చేరువ అవుతుండ‌డం.. నేత‌లు ఎంత చెప్పినా.. స్పందించ‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబు ఫైరైన‌ట్టు తెలిసింది.

“ఐక్యంగా ఉండాల‌ని.. ఐక్యంగా ప్ర‌చారం చేసుకోవాల‌ని అనేక సార్లు చెప్పారు. అయినా.. ఆ ఒక్క‌టి త‌ప్ప చేయాల్సిన‌వి అన్నీ చేస్తున్నారు. ఐక్యంగా ఉండ‌లేరా? కూట‌మి పార్టీల‌తో క‌లిసి ముందుకు సాగేందుకు మీకేంటి ఇబ్బంది?” అని చంద్ర‌బాబు సీరియ‌స్‌గానే ప్ర‌శ్నించార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను కూడా టీడీపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఎనిమిది నెల‌ల పాల‌న‌కు దీనిని రిఫ‌రెండంగా నిర్ణ‌యించుకుంది. పైగా వైసీపీ కూడా పోటీలో లేక‌పోవ‌డంతో.. గెలుపు గుర్రం ఎక్కాల‌న్నది పార్టీ వ్యూహం.

కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. నాయ‌కులు ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు అభ్య‌ర్థిగా ఉన్న ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. ఒంటరి పోరు చేస్తున్నారు. వీడియోలు చేస్తూ.. స్వీయ ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. కానీ, కూట‌మిగా నాయకులు మాత్రం ముందుకు రావ‌డం లేదు. అదేవిధంగా ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థి పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌ర్ విష‌యంలో కొంద‌రు మాత్ర‌మే స‌హ‌క‌రిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికి రెండు మూడుసార్లు చెప్పి చూసిన సీఎం చంద్ర‌బాబు.. తాజాగా మాత్రం ఫైరయ్యారు. ఐక్య‌త అన్న మాటే వినిపించ‌కుండా.. పోవ‌డంపై ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేయడంతోపాటు.. ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. ఆ ఒక్క‌టీ(ఐక్య‌త‌) త‌ప్ప‌.. అన్నీ ఉన్నాయి అంటూ.. చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డంతో నాయ‌కులు ఉలిక్కి ప‌డ్డారు. సోమ‌వారం నుంచి ప్రచారం పుంజుకునేలాచేస్తామ‌ని.. తామంతా ప్ర‌చారానికి వెళ్తామ‌ని నాయ‌కులు హామీ ఇచ్చారు.