పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ

ప్రజల తరఫున ప్రశ్నించేందుకు జనసేన పార్టీని 11 సంవత్సరాల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్థాపించారు. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడ్డారు పవన్. టీడీపీ, బీజేపీలతో కలిసి గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. 100 శాతం స్ట్రైక్ రేట్ తో తన పార్టీ తరఫున అందరినీ గెలిపించుకున్న పవన్ కల్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఏడాది జరగబోయే జనసేన ఆవిర్భావ వేడుకలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ వేడుకల నిర్వహణపై జనసేన పార్టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. జనసేన అధినేత పవన్ గెలుపొందిన పిఠాపురంలో ఈ వేడుక నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. 3 రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జనసేన సిద్ధాంతాలు, పవన్‌ కల్యాణ్‌ ఆశయాలు, ప్రజలకు జనసేన చేస్తున్న సేవ గురించి వివరించనున్నారు. దాంతోపాటు, భవిష్యత్తులో జనసేనను ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయాలపై కూడా చర్చించనున్నారు. ఏది ఏమైనా జనసేన ఘన విజయం తర్వాత జరగబోతున్న ప్లీనరీ కోసం జనసేన శ్రేణులు కూడా ఫుల్ జోష్ లో ఎదురుచూస్తున్నాయి. పార్టీ బలోపేతం, బూత్ లెవల్ లో సంస్థాగత నిర్మాణం గురించి పవన్ ఏ విధంగా ముందుకు పోబోతున్నారు అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.