ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ గా నియమితులు అయిన మాజీ మంత్రి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మె ల్యే కురసాల కన్నబాబుకు.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంత ఈజీకాదన్న వాదన పార్టీలో నే వినిపిస్తుండడం గమనార్హం.
ఉత్తరాంధ్రలో ఉన్నవి మూడు జిల్లాలే అయినా.. ముప్పై రకాల రాజకీయాలు ఇక్కడ సాగుతుంటాయి. నాకు నేనే రాజు-నేనే మంత్రి అన్నట్టుగా వైసీపీనాయకులు ఇక్కడ వ్యవహరిస్తుంటారనేది గతంలో ఇక్కడ ఇంచార్జ్‌గా పనిచేసిన సాయిరెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు.
“రాష్ట్రం మొత్తం రాజకీయాలు వేరు. ఉత్తరాంధ్ర రాజకీయాలు వేరు. ఇక్కడి మనుషులు, నాయకులను నెగ్గుకు రావడం అంటే మాటలు కాదు. అయినా.. నా శాయ శక్తులా పనిచేశాను.“ అని విశాఖ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో విజయం దక్కించుకున్న సందర్భంగా సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి.
నిజంగానే ఉత్తరాంధ్ర రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయన్నది వాస్తవం. కోస్తా, సీమల మాదిరిగా.. కాకుండా.. ఉత్తరాంధ్రలో నాయకులు భిన్నమైన శైలిని అనుసరిస్తారు.
పార్టీలు మారే వారు తక్కువగా ఉంటారు. ఉన్న పార్టీల్లోనే తమ పేరు వినిపించాలని కోరుకునే వారు ఎక్కు వగా ఉంటారు. ఇక, వ్యాపారాలు, వ్యవహారాల్లో కామన్‌గానే వారి పాత్ర కీలకం. దీంతో సఖ్యత కన్నా.. సొంత ప్రయోజనాలకే ఎక్కువగా మొగ్గు చూపుతారు.
అంతేకాదు.. కుటుంబ రాజకీయాలు కూడా.. ఉత్తరాంధ్రలో ఎక్కువగానే కనిపిస్తాయి. ఇక, సీనియర్ ఏదో చెప్పారని.. తమ పంథామార్చుకునే జూనియర్ నాయకులు కూడా తక్కువే. మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడివారు పట్టించుకుంటారా? అనేది సందేహం.
వైవీ సుబ్బారెడ్డి వంటివారికే .. ఇక్కడి నాయకుల నుంచి తీవ్ర ఎదురుగాలి వీచింది. పైగా.. లబ్ధ ప్రతిష్ఠులైన రాజకీయ నాయకులు ఉన్న ఉత్తరాంధ్రలో కురసాల కన్నబాబు వంటి వ్యక్తి నెట్టుకురావడం.. వారిని తనవైపు తిప్పుకోవడం అంటే.. అంత ఈజీకాదు. అయినప్పటికీ.. జగన్ అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయనను కాదనలేరు.
అయితే.. ఇక్కడ ఓ విషయంలో వైసీపీ సేఫ్ అవుతుంది. కన్నబాబు దూకుడు స్వభావం ఉన్న నాయకుడు కాకపోవడంతో అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుమించి ఆయన పార్టీలో మెరుపులు మెరిపిస్తారన్నది ప్రశ్నే!