జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్ర శనివారం పూర్తి అయ్యింది. మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడుల్లో జరిగిన ఈ యాత్రలో పవన్ తన తనయుడు అకీరా నందన్ తో కలిసి సాగారు.
తొలుత కేరళకు వెళ్లిన పవన్ అక్కడి నుంచి తన యాత్రను మొదలుపెట్టి… ఆ తర్వాత తమిళనాడు చేరుకున్నారు.. తమిళనాడులోనూ తాను నిర్దేశించుకున్న ఆలయాలను సందర్శించిన పవన్ శనివారం మద్యాహ్నం తన యాత్రను ముగించారు.
3 రోజుల పాటు కొనసాగిన పవన్ ఆద్మాత్మిక యాత్ర ముగిసినంతనే పవన్ నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అనంతరం గన్నవరం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వాస్తవానికి యాత్రకు బయలుదేరే ముందు పవన్ హైదరాబాద్ నుంచి బయలుదేరిన సంగతి తెలిసిందే.
అనారోగ్యం కారణంగా యాత్రకు ముందు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న పవన్… అటు నుంచి అటే యాత్రకు బయలుదేరారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం విధులకు పవన్ కొన్ని రోజులుగా దూరంగా ఉన్నట్లే లెక్క.
అయితే తంజావూరులో యాత్రను ముగించుకున్న పవన్ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉన్నా కూడా… అలా కాకుండా గన్నవరం చేరుకున్నారు. అంటే… అనారోగ్యం, ఆధ్యాత్మిక యాత్ర పేరిట కొన్నాళ్లు డ్యూటీకి దూరంగా ఉన్న తాను మరింత కాలం పాటు విధులకు దూరంగా ఉండదలచుకోని పవన్… వెనువెంటనే డ్యూటీలోకి దిగిపోయేందుకే నేరుగా గన్నవరం చేరుకున్నారని చెప్పాలి.
శనివారం రాత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్ లో సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి పవన్ పాలుపంచుకోనున్నారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates