మంత్రి చెప్పినా విన‌లేదు.. వైసీపీ ప్రో క్రాంట్రాక్ట‌ర్‌కు కోట్లు ఇచ్చేశారు!

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో ఏం జ‌రుగుతోంది? అధికారులు.. మంత్రుల మాట విన‌డం లేద‌ని, వారికి న‌చ్చిన‌ట్టు చేస్తున్నార‌ని.. కొన్ని రోజులుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు కూడా ఒక‌టికి రెండు సార్లు అధికారుల‌ను హెచ్చ‌రించారు. మంత్రుల మాట విన‌క‌పోతే ఎలా? అని కూడా నిల‌దీశారు. ఇక నుంచి ఎలాంటి ఫిర్యాదులు వ‌చ్చినా సీరియ‌స్‌గా ఉంటుంద‌ని చెప్పారు.

కానీ, ఎందుకో.. అధికారులు మాత్రం మంత్రులు చెప్పిన మాట‌ను పూచిక పుల్ల మాదిరిగా తీసేస్తున్నారు. ఏదో చిన్నా చిత‌క శాఖ‌లో ఉన్న‌తాధికారులు మంత్రి చెప్పింది విన‌లేదంటే అర్ధం చేసుకోవ‌చ్చు. స‌రేన‌ని స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ, ముఖ్య‌మంత్రి త‌ర్వాత‌.. అంత‌టి స్థాయి, ప్రొటోకాల్ ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ చెపిన మాట‌ను కూడా అధికారులు విన‌లేదంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది! ఔనా? అని కూడా అనిపిస్తుంది.. కానీ.. ప‌క్కా నిజం! ఈవిష‌యాన్ని మంత్రి తాజాగా బ‌య‌ట పెట్టారు.

శ‌నివారం ఉద‌యం స‌చివాల‌యానికి వ‌చ్చిన మంత్రి ప‌య్యావుల‌.. త‌న శాఖ‌లో పెండింగులో ఉన్న బిల్లు ల‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో గ‌తంలో త‌న దృష్టికి వ‌చ్చిన విశాఖ‌లోని రుషి కొండ భ‌వ‌నాల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ ఫైలు క‌నిపించ‌లేదు. అప్ప‌ట్లో జ‌గ‌న్‌.. రూ.500 కోట్ల ఖ‌ర్చుతో ఈ ఇంద్ర భ‌వ‌నాన్ని నిర్మించ‌డం.. త‌ర్వాత వివాదం కావ‌డం తెలిసిందే. అయితే.. స‌ర్కారు మార‌డంతో దీనికి సంబంధించిన బ‌కాయిలను ఇప్ప‌ట్లో చెల్లించ‌కూడద‌ని నిర్న‌యం తీసుకున్నారు.

ఇదే విష‌యాన్ని ప‌య్యావుల కూడా త‌న శాఖ అధికారుల‌ను ఆదేశించారు. కానీ, తాజాగా స‌ద‌రు పెండింగు ఫైలు ఆయ‌న‌కు క‌నిపించ‌లేదు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ఉన్న‌తాధికారుల‌ను ప్ర‌శ్నించారు. అయితే.. వారు బిల్లులు క్లియ‌ర్ అయిపోయాన‌ని.. మెల్ల‌గా చెప్పారు. దీంతో అగ్గిమీద గుగ్గిలం అయిన‌.. ప‌య్యావుల‌.. “నేను వ‌ద్ద‌ని చెప్పిన త‌ర్వాత కూడా.. బిల్లులు ఎలా చెల్లిస్తారు? వైపీపీ అనుకూల కాంట్రాక్ట‌ర్ల బిల్లులు ఆపాల‌ని చెప్పాను క‌దా?“ అని నిప్పులు చెరిగారు. కానీ, అధికారులు మౌనం పాటించారు.

దీనిపై సీఎంచంద్ర‌బాబుకు ఫిర్యాదు చేయాల‌ని ప‌య్యావుల నిర్ణ‌యించుకున్నట్టు ఆర్థిక శాఖ వ‌ర్గాలు తెలిపాయి. అయితే.. ఇక్క‌డే మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. రుషి కొండ భ‌వ‌నాన్నినిర్మించిన కాంట్రాక్టర్‌కు కాకుండా.. అక్క‌డే వేరే ప‌నులు చేసిన వారికి పెండింగు బిల్లులు చెల్లించిన‌ట్టు తెలుస్తోంది. అయితే .. ఈ బిల్లులు కూడా చెల్లించ‌వ‌ద్ద‌ని గ‌తంలో మంత్రి ఆదేశించ‌డంగ‌మ‌నార్హం. ఎలా చూసుకున్నా.. అధికారుల తీరు వివాదంగా మారుతోంది.