రాజకీయ నాయకులు మామూలుగా సినిమాటిక్ భాష వాడటం ఎప్పటి నుంచో ఉన్నా మన రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు అయితే ఈ విషయంలో నాలుగు ఆకులు ఎప్పుడో ఎక్కువ చదివేశారు. అందుకే వీళ్ల నోట నుంచి ఎక్కువుగా సినిమాటిక్ డైలాగులు.. కథలు వినిపిస్తూ ఉంటాయి. ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు ఆ టైంలో పాపులర్ హిట్ సినిమాలు.. పాపులర్ సినిమా డైలాగులు బాగా వాడేసుకుని వీళ్లు పాపులర్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం ఒకసారి బాహుబలి గురించి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. ఆ తర్వాత అదే మోదీ పుష్పలో అల్లు అర్జున్ స్టైల్‌ను అనుకరించారు.
ఇక కొద్ది రోజుల క్రితమే ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్. జగన్ తన 2.0 గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైందని చెప్పడంతో పాటు.. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ 2.0 ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటుందని.. జగన్ 2.0లో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అసలుతో పాటు వడ్డీ లెక్క కలిసి ఇస్తానని కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా ఖచ్చితంగా బిఆర్ఎస్ 3.O వస్తది… కెసిఆర్ 3.0 వస్తుందని.. అప్పుడు ఉద్యమకారులు అందరికి న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పారు.
తన చేతిలో ఎలాంటి అవకాశం ఉన్నా కూడా ఉద్యమ కారులకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని కవిత చెప్పారు. ఎవ్వరూ దిక్కులేనప్పుడు గులాబీ జెండా మోసిన ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే అని కవిత కుండబద్దలు కొట్టారు. ఆ బాధ్యత తానే తీసుకుంటానని.. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కారులు అందరికి తాను మాట ఇస్తున్నానని ఆమె తెలిపారు. మధ్యలో వచ్చినోళ్లు మనోళ్లు కాదనడం లేదు.. అందరిని కలుపుకుని వెళ్లాలని కవిత చెప్పారు. ఏదేమైనా జగన్ ఇటీవలే తన 2.0 గురించి చెపితే ..ఇప్పుడు కవిత కెసిఆర్, బిఆర్ఎస్ 3.O గురించి చెప్పారు.