మోదీ కులంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్ వేదికగా బీసీ జన గణన, ఎస్సీ వర్గీకరణపై జరిగిన సమావేశంలో మాట్లాడిన సందర్బంగా మోదీ కులాన్ని ప్రస్తావించిన రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా మోదీపై ఏ ఒక్కరు చేయనంత స్థాయిలో రేవంత్ విమర్శలు గుప్పించిన తీరు కలకలం రేపుతోంది. అంతేకాకుండా రేవంత్ వ్యాఖ్యలతో రానున్న కొద్ది రోజుల పాటు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజీలో నడిచే అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు.

అయినా ప్రధాని మోదీ గురించి రేవంత్ ఎమన్నారన్న విషయానికి వస్తే… ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను బీసీ అని చెప్పుకుంటారని రేవంత్ అన్నారు. అయితే వాస్తవానికి మోదీ నిజమైన బీసీ కాదని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ”నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు మోదీ ఉన్నత వర్గాలకు చెందిన వారే. గుజరాత్ సీఎం అయ్యాక మోదీ తన కులాన్ని బీసీల్లో కలుపుకున్నారు. మోదీకి బీసీ సర్టిఫికెట్ ఉండొచ్చు గానీ… మోదీ మనస్తత్వం మాత్రం బీసీలకు వ్యతిరేకం” అని రేవంత్ వ్యాఖ్యానించారు.

మోదీని నేరుగానే టార్గెట్ చేసిన రేవంత్.. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..,. మోదీ నిజమైన బీసీనే అయితే 2021లో దేశంలో జనాభా లెక్కలు ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. దేశంలో బీసీల లెక్క ఎందుకు తేల్చలేదని కూడా రేవంత్ నిలదీశారు. మోదీని అగ్రవర్ణాలకు చెందిన నేతగానే తేల్చేసిన రేవంత్…మోదీ పాలనలో బీసీలకు న్యాయమేమీ జరగడం లేదని ఆరోపించారు. మోదీ లాంటి నేతలు ఉన్నంత కాలం కూడా బీసీలకు న్యాయం దక్కదని కూడా రేవంత్ సెటైరికల్ పంచ్ లు సంధించారు. రేవంత్ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెను కలకలమే రేపనున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.