వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో నిందితుడిగా ఉన్న వంశీ… ఆ కేసును నీరుగార్చేందుకు ఏకంగా ఫిర్యాదుదారుడినే భయపెట్టి… కిడ్నాప్ చేసి…కేసు విత్ డ్రా చేసుకునే దిశగా నయా ప్లాన్ అమలు చేశారంటూ పోలీసులు కొత్త కేసు కట్టారు.
ఆ కేసులోనే ఆయనను అరెస్ట్ చేసి… గురువారం మధ్య రాత్రి దాటిన తర్వాత ఆయనను జడ్జీ ఆదేశాలతో జైలుకు తరలించారు. ఈ కేసు మీద, వంశీ అరెస్ట్ మీద వైసీపీ ఓ రేంజిలోనే స్పందించింది. ఏకంగా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి జడ్జీ ముందు వంశీ తరఫున వాదనలు వినిపించారు.
వైసీపీకి చెందిన చాలా మంది నేతలు కూడా వంశీ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. అయితే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అంతగా స్పందించలేదనే చెప్పాలి. అసలు వంశీ అరెస్ట్ అయిన విషయం తనకు తెలియదన్నట్లుగానే జగన్ వ్యవహరించాన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వంశీ అరెస్ట్ అయినా కూడా ఏమీ పట్టనట్టుగానే వ్యవహరించిన జగన్… శుక్రవారం ఉదయం కడప జిల్లాలో జరుగుతున్న పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడి వివాహానికి వెళ్లిపోయారు. ఆ కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఆయన అటు నుంచి అటే బెంగళూరుకు వెళ్లనున్నారు.
వాస్తవానికి జగన్ కు వంశీ అత్యంత సన్నిహితంగా మెలగారు. కొడాలి నానితో కలిసి జగన్ ప్రత్యర్థి వర్గం అయిన టీడీపీపై ఆయన ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నంత కాలం వంశీకి జగన్ ఫుల్ ఫ్రీడం ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో వంశీ కూడా భారీ ఎత్తున సంపాదించుకున్నారని కూడా స్వయంగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖే నిగ్గు తేల్చింది.
అయితే వంశీ అరెస్ట్ కాగానే… అసలు ఈ విషయంతో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా జగన్ వ్యవహరించారని చెప్పాలి. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్ అయితే నానా యాగీ చేసిన జగన్….సురేశ్ కు ధైర్యం చెప్పేందుకు ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇక సురేశ్ విడుదల కాగానే… తన కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లి మరీ తనతో పాటు బోజనం చేసే భాగ్యాన్ని కల్పించారు.
అయితే ఈ తరహా మద్దతు వంశీకి జగన్ నుంచి లభించలేదనే చెప్పాలి. కనీసం ఓ ఎమ్మెల్యే స్థాయి… బలమైన నేతగా ఉన్న వంశీని అరెస్ట్ చేస్తే…వైసీపీ నేతలంతా క్యూ కట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తే.. జగన్ కనీసం ఓ పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే… వంశీతో తన పని అయిపోయిందన్న రీతిగా జగన్ వ్యవహరిస్తున్నాన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
మరి ఇప్పుడయినా జగన్ ఈ విషయంపై స్పందిస్తారా లేదా అనేది ఇవాళ రేపట్లో తేలిపోతుంది. ప్రెస్ మీట్ లేదా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ రూపం లో రీ విషయం పై జగన్ స్పందిస్తారని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates