గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వంశీ అరెస్టు సమయంలో ఎంత హై డ్రామా నడిచిందో…ఆ తర్వాత ఆయనను విజయవాడకు తరలించిన తర్వాత కూడా అంతకు మించిన హై డ్రామా నడిచింది.
వంశీని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని వంశీ భార్య పంకజశ్రీ అనుసరించడంతో నందిగామ వద్ద ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని, తమను ఫాలో చేయవవద్దని చెప్పినా ఆమె వినలేదు. దీంతో, సమీపంలోని ఓ డ్రైవింగ్ స్కూల్ లో ఆమెను ఉంచి, ఆమె ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, ముందుగా వంశీని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించి..
అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు 2 గంటల నుంచి ఆయనను పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు.
ఇక, వంశీ తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదయ్యాయి. అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి.
వంశీ విచారణ నేపథ్యంలో కృష్ణలంక పీఎస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ ను వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారని, కేసు విత్ డ్రా చేసుకోవాలని సత్యవర్థన్ ను వంశీ బెదిరించారని ఫిర్యాదు రావడంతో పోలీసులు వంశీని అరెస్టు చేశారు. ఆయన అనుచరులపై కూడా కేసు నమోదైంది.
మరోవైపు, వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్-30 అమలులో ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎటువంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వంశీ అరెస్టు నేపథ్యంలో వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates