“ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. సమాజంలో బద్ధకస్తులను పెంచుతున్నాయి. ఇది సరికాదు. సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు. కష్టపడే వయసులోనూ.. పనిచేయకుండా ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ పరిస్థితికి రాజకీయాలే కారణం. దీనిపై సరైన విధానం అంటూ ఒకటి ఉండాలి. లేకపోతే.. సమాజాలు దైన్యంగా మారి.. ఉత్పత్తి శక్తి నశిస్తుంది. అంతిమంగా ఇది మరో ఉపద్రవానికి దారితీస్తుంది“ అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
తాజాగా పట్టణ ప్రాంతాల్లోని బెగ్గర్లు, నిరాశ్రయులకు ప్రభుత్వాలు అధికారిక ఆశ్రయం కల్పించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇటీవల మధ్య ప్రదేశ్ రాజధాని ఇండోర్‌ను `బెగ్గర్ ఫ్రీ`(యాచక రహిత) సిటీగా మార్చిన విషయం తెలిసిందే.
దీంతో వందల మంది యాచకులకు ఆశ్రయం లేకుండా పోయిందని సామాజిక ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వారిని ఆదుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ.. పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిని విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు.. యాచకులను ఆదుకునే విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో చెప్పాలని ప్రతివాదులను ప్రశ్నించింది. దీనిపై సంబంధిత న్యాయవాదులు.. ఉచిత పథకాలతో ప్రభుత్వాలు ఆదుకుంటున్నట్టు సెలవిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉచిత పథకాల ఇష్యూను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల్లో ఉచితాలు ఇవ్వకపోతే.. గెలవలేరా? ప్రభుత్వాలు ఏర్పడలేవా? అని నిలదీసింది.
ఉచితాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న చర్చ ఎప్పటి నుంచో ఉందని పేర్కొంది. పైగా.. శ్రమ శక్తి తగ్గిపోతోందని, ఉచితంగా ఇస్తున్నారు కదా! అంటూ.. సమాజంలో పనిచేసే వయసున్న వారు కూడా పక్కన కూర్చుంటున్నారని వ్యాఖ్యానించింది.
ఏ పనీ చేయకుండానే.. డబ్బులు ఇస్తుండడంతో ఇది మరో పెను సమస్యగా మారే అవకాశం ఉంటుందని.. అప్పుడు ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది. దీనిపై రాజకీయ పక్షాలు.. ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. తాజా పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది.