6 నిమిషాల్లో నిండు ప్రాణాన్ని కాపాడిన ఏపీ పోలీసులు!

వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా… ఆరంటే ఆరు నిమిషాల్లోనే ఓ నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. అది కూడా ఎక్కడో రెండు, మూడు జిల్లాల ఆవల ఆ ప్రాణం ఆపదలో ఉంటే… అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుని ఏపీ పోలీసులు ఆ నిండు ప్రాణాన్ని కాపాడారు. ఈ ఘటనలో ఆత్మహత్యకు సిద్ధమైపోయిన ఓ వ్యక్తి… మరికాసేపు ఉంటే… ఓ లాడ్జిలోని గదిలో తిరుగుతున్న ఫ్యానుకు విగత జీవిగా వేలాడేవాడే.

అయితే ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ సమయస్ఫూర్తి, మరో సబ్ ఇన్ స్పెక్టర్ దూకుడు, ఓ కానిస్టేబుల్ వేగం.. ఆ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టాయి. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ ఘటన కాకినాడ జిల్లాలోని అన్నవరంలో జరిగింది.

ఈ ఘటన వివరాల్లోకెళితే… ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన యువకుడు ఆర్థిక సమస్యలతో తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని అతడు తన కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసి… అన్నవరంలోని ఓ లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకునేందుకు సిద్ధపడ్డాడు. అప్పటికే అతడు ఉరేసుకునేందుకు ఫ్యానుకు తాడు కూడా సిద్ధం చేసుకున్నాడు.

అయితే ఆ యువకుడి కుటుంబం అతడి సెల్ఫీ వీడియో చూసి వెంటనే. పి.గన్నవరం సీఐ భీమరాజుకు సమాచారం ఇచ్చారు. ఈ వీడియోను చూసిన భీమరాజు.. ఎలాగైనా అతడిని కాపాడాల్సిందేనని తీర్మానించుకున్నారు. అనుకున్నదే తడవుగా… బాధితుడి సెల్ ఫోన్ సిగ్నల్ కోసం కానిస్టేబుల్ జాఫర్ ను రంగంలోకి దించారు.

సీఐ నుంచి వచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన టెక్నికల్ టీం సభ్యుడు జాఫర్.. బాధితుడు కాకినాడ జిల్లా అన్నవరంలో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అతడి మొబైల్ ఫోన్ చివరి లొకేషన్ ను కూడా సీఐకి చేరవేశారు. దీంతో అన్నవరం ఎస్సైగా ఉన్న శ్రీహరిని భీమరాజు అలెర్ట్ చేశారు. క్షణాల్లో రంగంలోకి దిగిపోయిన శ్రీహరి.. బాధితుడి లొకేషన్ ను తన సిబ్బందికి ఇచ్చి తాను కూడా లొకేషన్ కు వెళ్లారు.

ఆ లొకేషన్ లో లాడ్జీలు ఉండటం… వీడియోలో కూడా బ్యాక్ డ్రాప్ అంతా ఓ లాడ్జి రూం లాగా కనిపించడంతో లాడ్జీ ఓనర్ల గ్రూపులో సదరు వీడియోను అప్ లోడ్ చేసి వాకబు చేశారు. దీంతో సదరు లాడ్జి ఓనర్ వేగంగా స్పందించి… బాధితుడు ఉన్న గది తలుపులను బద్దలు కొట్టి అతడిని కాపాడారు. ఇదంతా కేవలం ఆరంటే ఆరు నిమిషాల్లో జరిగిపోయిందట.