మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ తరహా ఫలితాలు ఆ పార్టీకి చెంపపెట్టేనని చెప్పక తప్పదు. అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన శ్రేణులు రాష్ట్రంలో దారుణాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేనలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే… ఇప్పుడు వైసీపీ ఓడిపోయినా కూడా ఆ పార్టీ శ్రేణుల దౌర్జన్యాలు ఆగట్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మాట నిజమేనన్నట్టుగా ప్రకాశం జిల్లాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితుడు నేరుగా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఎర్రగొండపాలెంలో యెలక మల్లికార్జున్ అనే యువకుడు మెడికల్ షాప్ నిర్వహించుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇతడి షాప్ కు వచ్చిన కొందరు వైసీపీ కార్యకర్తలు మందులు కొనుగోలు చేశారు. అయితే… ఆ మందులకు వారు డబ్బులు ఇవ్వలేదు. దీంతో డబ్బులు ఇవ్వమని అడిగిన మల్లికార్జున్ ఫై వారు దాడికి పాల్పడ్డారు. తాము వైసీపీ లీడర్లమని… తమనే డబ్బులు అడుగుతావా అంటూ రక్తం వచ్చేలా కొట్టారు. ఆ దెబ్బలకు బాధితుడు రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మల్లికార్జున్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు దీనిపై పెద్దగా స్పందించలేదట. దీంతో ఎం చేయాలో పాలుపోని మల్లికార్జున్… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. తనపై జరిగిన దాడి దృశ్యాల వీడియోను పంపారు. ఈ వీడియో చూసిన వెంటనే స్పందించిన లోకేష్.. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రకాశం జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పాలనలో నిత్యం బిజీగా ఉండే లోకేష్… ఇలాంటి ఘటనలపై తక్షణం స్పందిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. లోకేష్ తక్షణ స్పందనతో తనకు న్యాయం జరిగిందని మల్లికార్జున్ ఆనందం వ్యక్తం చేశాడు.