పవన్ కల్యాణ్ ధర్మ పరిరక్షణ యాత్ర షురూ!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైందవ ధర్మ పరిరక్షణ యాత్ర బుధవారం మొదలై పోయింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్.. ఇప్పటికే ఈ యాత్రను ఓ మారు వాయిదా వేసుకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా మరోమారు యాత్రను వాయిదా వేసుకునేందుకు ఆయన ససేమిరా అన్నారు. ఈ క్రమంలో బుధవారం ఇదివరకే నిర్దేశించుకున్నట్టుగా ధర్మ పరిరక్షణ యాత్రకు పవన్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి కేరళలోని కొచ్చికి ఆయన బయలుదేరారు. ఇప్పటికే కొచ్చిలో ల్యాండ్ అయిన పవన్ నగర సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుని తన యాత్రను ప్రారంభించనున్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో పవన్ కేరళతో పాటు తమిళనాడులోని పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకోనున్నారు. పవన్ దర్శించుకునే ఆలయాల్లో అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. హైందవ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ఈ ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసిందే.

ధర్మ పరిరక్షణ యాత్రకు బయలుదేరుతున్న సందర్బంగా పవన్ కాషాయ దుస్తులతో కనిపించారు. పంచెకట్టు, లాల్చీ, భుజాలను కప్పుతూ కండువా వేసుకుని పవన్ తన ఇంటి నుంచి బయలుదేరారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు వచ్చిన సందర్బంగా తిరుమలలో ధరించిన తరహా దుస్తులతోనే పవన్ ఈ యాత్రకు ఉపక్రమించడం గమనార్హం. ఈ దుస్తుల్లో పవన్ యాత్రకు బయలుదేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.