వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. పైకి అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం పై ఎత్తులు వేసుకుంటు.. నాయకులు రగిలిపోతున్నారు. ఉత్తరాంధ్రలో ఈ కుమ్ములాటల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
నాయకుల మధ్య పదవులకు సంబంధించిన వ్యవహారం.. వ్యక్తిగత కారణాలతో రచ్చకెక్కుతోంది. విషయంలోకి వెళ్తే.. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ చార్జిగా.. నిన్న మొన్నటి వరకు.. సాయిరెడ్డి వ్యవహరించారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఆయనను తప్పించారు.
వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. కానీ, ఆయన దూకుడు ప్రభావం చూపలేదు. ఫలితంగా ఉత్తరాంధ్రలో పార్టీ దెబ్బతింది. దీంతో సాయిరెడ్డిని తీసుకువచ్చి మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు.
కానీ, ఇటీవల ఆయన అనూహ్యంగా పార్టీకి, తన పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఉత్తరాంధ్ర ఇంచార్జ్ పీఠం ఖాళీ అయింది. ఈ పదవిని దక్కించుకునేందుకు మాజీ మంత్రి, అనకా పల్లి మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి వైవీ సుబ్బారెడ్డిని తప్పించినప్పుడే.. గుడివాడ తెరమీదకు వచ్చారు. కానీ.. ఇంతలోనే సాయిరెడ్డికి బాధ్యతలు ఇవ్వడంతో కొన్నాళ్లు మౌనం పాటించారు. ఇక, ఇప్పుడు సాయిరెడ్డి తనంతట తాను వెళ్లిపోవడంతో గుడివాడ మరోసారి ఈ పీఠం కోసం ఎదురు చూస్తున్నారు.
పార్టీ తరఫున తరచుగా మీడియా ముందు కామెంట్లు కూడా చేస్తున్నారు. పైగా.. ఈ స్థానం కోసం ఎవరూ ప్రయత్నం చేయకపోవడం కూడా తనకు కలిసి వస్తుందని గుడివాడ లెక్కలు వేసుకున్నారు.
కానీ, గుడివాడకు బాధ్యతలు అప్పగించే విషయంలో మరో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్య నారాయణ ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించడం లేదు. గుడివాడకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇస్తే.. తమ హవాకు బ్రేకులు పడతాయన్న ఆవేదన కావొచ్చు.. లేదా..
తనకంటే జూనియర్ అయిన.. గుడివాడకు అప్పగిస్తే.. తనకు ఇబ్బందని భావించవచ్చు. వీటికి తోడు.. గుడివాడ స్థానికుడు కావడం.. బొత్సకు మరింత ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో గుడివాడ చేస్తున్న ప్రయత్నాలకు బొత్స గండికొడుతున్నట్టు తెలుస్తోంది.
బొత్సను కాదని.. గుడివాడకు ఉత్తరాంధ్ర పగ్గాలు ఇచ్చినా.. నిత్యం తలనొప్పులు ఖాయం. పైగా పార్టీలోనూ చీలికలు వచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాలు వున్నాయి. ఈ నేపథ్యంలో జగన్.. ఇరు పక్షాలను దూరం పెట్టి.. ఉమ్మడి కృష్నాజిల్లా కు చెందిన కీలక నాయకుడికి ఈ బాధ్యతలు అప్పగించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.
దీంతో గుడివాడ వర్సెస్ బొత్స మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌ను పరిష్కరించడంతోపాటు.. కీలక నేతను కూడా సంతృప్తి పరిచినట్టు అవుతుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.