ఏపీ సీఎం చంద్రబాబు లౌక్యం ప్రదర్శించారు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. వీటిలో కొన్ని కూటమి ధర్మానికి కట్టుబడి జనసేన, బీజేపీ నాయకులకు కూడా ఇచ్చారు. అయితే.. ఎన్నికలకుముందు ఆయా పార్టీల తరఫున బలంగా పోరాటం చేసిన వారికి.. వైసీపీపై పోరాడి కేసులు ఎదుర్కొన్న వారికి కీలక పదవులు కట్టబెట్టారు. అదేవిధంగా ఫైర్ బ్రాండ్స్‌గా పేరు తెచ్చు కున్నవారికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక, పార్టీ తరఫున, సామాజిక వర్గాల వారీగా పోరాటం చేసిన వారికి కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఇంకొన్ని రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు కూడా ఇచ్చారు. అయితే.. వారి వారి స్థాయిలు.. చేసిన పోరాటాలను బట్టి.. ఈపదవులు దక్కాయి. అయితే..ఇప్పుడు వీరికి ఇచ్చే జీతాల విషయంలోనూ అదే విధంగా ఫిక్స్ చేశారు. బాగా పనిచేసిన వారికి ఎలా అయితే.. కీలక పదవులు దక్కాయో.. వారికి అంతే మొత్తంలో చెల్లింపులు చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు.
మొత్తం నామినేటెడ్ పదవులను ఏ-బీ కేటగిరీలుగా విభజించారు. వీటిలో జనసేన దక్కించుకున్నవి, బీజేపీ దక్కించుకున్నవి కూడా ఉన్నాయి. ఇలా విభజించిన వారికి.. ఏ కేటగిరీలో ఉన్న వారికి లక్షా 25 వేల నికర జీతాన్ని ఫిక్స్ చేశారు. ఇక, బీ కేటగిరీలో ఉన్న పదవులకు నికరంగా 60 వేల చొప్పున ఫిక్స్ చేశారు. దీంతో బాగా పనిచేసిన వారు సంతోషిస్తున్నారు. తమకు తగిన గుర్తింపుతో పాటు వేతనం కూడా లభిస్తున్నట్టు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఇతర విషయాలైన.. భత్యాలు, రవాణా, గదుల అద్దె, సర్వెంట్లు, డ్రైవర్లు, కార్లు వంటి వాటి విషయంలో అందరికీ సమానంగా ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఏ కేటగిరిలో ఉన్నవారికి.. 2 లక్షల పైచిలుకు వస్తుంటే .. బీ కేటగిరీలో ఉన్నవాకి 1.93 లక్షలు వస్తున్నాయి. వేతనాల రూపంలో కొంత వ్యత్యాసం కనిపిస్తున్నా.. ఇతర భత్యాలు, అలవెన్సుల విషయంలో సమానంగా ఉండడంతో ఎవరినీ నొప్పించని విధంగా చంద్రబాబు లౌక్యం ప్రదర్శించారు. దీంతో నామినేటెడ్ పర్వంలో కీలక ఘట్టం ముగిసింది.