జనసేనలో నాయకుల కొరత తీవ్రంగానే ఉంది. పైకి కనిపిస్తున్న వారంతా పనిచేయడానికి తక్కువ.. వివాదాలు సృష్టించేందుకు ఎక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జనసేనలో క్షేత్రస్థాయి నాయకుల బలం తక్కువగా ఉంది. ఇక, కార్యకర్తల విషయానికి వస్తే.. సినీ మెగా అభిమానులే మెజారిటీ కార్యకర్తలుగా ఉన్నారు. దీంతో జనసేనకు నాయకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి.. ఇప్పటికిప్పుడు రాజకీయంగా ఇబ్బందులు లేకపోయినా.. మున్ముందు సమస్యగా మారే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ జనసేన గెలిచేందుకు పార్టీ అధినేత పవన్ ఇమేజ్ పనిచేసింది. దీనిలో ఎలంటి సందేహం లేదు. అయితే.. సినీ గ్లామర్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అది కూడా యువత వరకు ఓకే.. కానీ.. మున్ముందు.. ఇదే గ్లామర్‌తో మొత్తం పార్టీని నడిపించడం ఇబ్బందే. ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ కూడా సినీ గ్లామర్‌తోనే నెట్టుకొచ్చారు. తొలిసారి అధికారంలోకి రావడానికి ఆయన సినీ ఇమేజ్ పనిచేసింది.
కానీ, తర్వాత తర్వాత.. పాలనపై అంచనాకు వచ్చిన ప్రజలు దూరం జరుగుతూ వచ్చారు. అప్పుడు కూడా.. అన్నగారు ఒకవైపు పాలిస్తూనే మరోవైపు సినిమాలు చేశారు. అయినప్పటికీ.. ఆయన ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. ఇక, తమిళనాడులో కూడా సినీ గ్లామర్ కొంత వరకే పనిచేసింది. కమల్ హాసన్ వంటి విశ్వనటులు పార్టీ పెట్టినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఇది అందరు నటులకు వర్తించేదే. ఈ ప్రాతిపదికన తీసుకుంటే.. ఇప్పుడు కాకపోయినా.. వచ్చే పదేళ్లకు జనసేన కు కార్యకర్తల బలం చాలా అవసరం.
దీనిపై తాజాగా అధ్యయనం కూడా జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాల పై అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పైకి నాయకులు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో బలం తక్కువగా ఉందని.. పార్టీ వాయిస్ వినిపించేవారు తక్కువ సంఖ్యలో ఉన్నారని ఆయన గ్రహించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆరు మాసాల్లో మెరికల్లాంటి యువతను ఎంపిక చేసి.. వారికి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా..బలమైన నాయకత్వాన్ని తయారు చేయాలని యోచిస్తున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates