ప్రధాని నరేంద్ర మోడీకి ఈ శనివారం అత్యంత ఇష్టమైన రోజు. ఎందుకంటే… పదేళ్లకు పైబడి ఢిల్లీ సీఎం సీటును చేజిక్కించుకునేందుకు మోడీ వేయని ప్లానూ లేదు… చేయని కసరత్తు లేదు. ఇన్నేళ్లకు గాని మోడీ కల నెరవేరలేదు. శనివారం వెలువడ్డ ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో అధికార ఆప్ ను గద్దె దించిన బీజేపీ… ఢిల్లీ సీఎం పీఠాన్ని చేజిక్కించుకుంది. ఈ ఫలితం బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని చెప్పాలి. మోడీ ఆనంద డోలికల్లో విహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా మోడీ నోట టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరు వినిపించింది. అంతేనా… చంద్రబాబు గొప్పతనాన్ని మోడీ వేనోళ్ళ కొనియాడారు.
ఢిల్లీ ప్రజలు మొన్నటి దాకా మోసకారి పాలనకు మొగ్గారని చెప్పిన మోడీ… ఈ ఎన్నికల్లో మాత్రం ఆ మోసాన్ని గుర్తించారని తెలిపారు. ఫలితంగా మోసకారి ఆప్ పాలనకు చరమ గీతం పాడారని అన్నారు. ఆప్ నేతలకు అసలు పాలనా ఆంటే ఏమిటో కూడా తెలియదని కూడా మోడీ ఆరోపించారు. పరిపాలన అన్నా.. సుపరిపాలన అన్నా.. ఎన్డీయే ను చూసి నేర్చుకోవాలని మోడీ అన్నారు. ఈ సందర్బంగా మోడీ నోట చంద్రాబు పేరు వినిపించింది. సుపరిపాలనకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు నిలిచారన్న మోడీ… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అదే సుపరిపాలనను ఆయుధంగా చేసుకుని విజయం సాధించారని చెప్పారు.
ఇటీవలి విజయంతో చంద్రబాబు తన ట్రాక్ రికార్డును నిరూపించుకున్నారని మోడీ అన్నారు. సుపరిపాలనకు కేరాఫ్ అడ్రస్ అయిన ఎన్డీయేలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉండటం శుభ పరిణామమని ఆయన అన్నారు. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులు ఎన్డీయేకు ఎంతో అవసరమని కూడా మోడీ అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయించామని మోడీ అన్నారు. చంద్రబాబు లాంటి నేతల ప్రచారం ఢిల్లీలో బీజేపీ విజయంలో కీలక భూమిక పోషించిందని కూడా మోడీ పేర్కొన్నారు.