ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మాట
కు తెలుగు ఓటరు ఓటెత్తాడు. ఆయన మాటలను విశ్వసించాడు. ఎన్నికల ప్రచారంలో కేవలం కొద్ది గంటలు మాత్రమే చం ద్రబాబు ప్రచారం చేసినా.. ఆయన ప్రసంగాలు దుమ్ము రేపాయి. అప్పట్లోనే లక్షల మంది ఢిల్లీ ప్రజలు ఆయన ప్రసంగాలను విన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ వేస్తున్న అడుగులకు మనం మద్దతివ్వాలని.. భారత్ వికాసానికి మోడీ బలమైన నాయకుడని చెప్పిన తీరు ఓట్లను కురిపించింది.
తాజాగా వెల్లడవుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో చంద్రబాబు ప్రచారం చేసిన .. దాదాపు అన్నినియోజకవర్గాల్లోనూ.. కమలం పార్టీ అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. షహారాబాద్, షాదారా, విశ్వాస్ నగన్, సంగం విహార్, సహద్రలో చంద్రబాబు ప్రచారం చేశారు. మరికొన్ని గంటల్లోనే ప్రచారం ముగిసిపోతుందనగా.. సీఎం అక్కడకు వెళ్లి.. ఆయా ప్రాంతాల్లో రోడ్ షో చేశారు. అదేవిధంగా సహద్రలో నిర్వహించిన బహిరంగ సభలోనూ ప్రసంగించారు.
ఈ సందర్భంగా మోడీ అవసరం, బీజేపీ ప్రాధాన్యాన్ని వివరించారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కూడా ప్రస్తావించారు. ఇదేసమయంలో ప్యాలెస్‌లు కట్టుకున్నవారిని ఏపీ ప్రజలు తిరస్కరించి.. తిప్పి కొట్టి తరిమేశారని.. ఇక్కడ(ఢిల్లీ) కూడా.. అద్దాల భవంతులు కట్టుకున్న కేజ్రీవాల్ వంటివారిని తరిమి కొట్టాలని ఆయన ఇచ్చిన పిలుపు.. ఓట్ల రూపంలో బ్యాలెట్‌ను బద్దలు చేసింది. శనివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచి బాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కమల నాథులు దూసుకుపోవడం స్పష్టంగా కనిపించింది.
టీడీపీ జోష్..
చంద్రబాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కమల వికాసం జరగడం పట్ల ఏపీ, తెలంగాణల్లోని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటున్న సీనియర్ నాయకులు.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వినతిని గౌరవించిన ఢిల్లీలోని తెలుగు వారికి కృత జ్ఞతలు తెలిపారు. చంద్రబాబు మాటకు, ఆయన పిలుపునకు స్పందన మరో 30 ఏళ్లపాటు శాశ్వత మని వారు అభిప్రాయపడ్డారు.