దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. 699 మంది అభ్యర్తులు.. 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ పోల్స్ కు సంబంధించి ఆది నుంచి పెద్ద ఎత్తున ప్రచారం.. రాజకీయం సాగాయి. ఎవరికి వారు నాయకులు, కార్యకర్తలు.. పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇంకేముంది.. ఓటరు నాడిని పట్టుకోవడం కష్టమని కూడా అనుకున్నారు. నిజానికి ఢిల్లీ ఎన్నికల ప్రచారం కూడా అలానే సాగింది.
తాజాగా శనివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయ్యాక.. ఎలాంటి ఉత్కంఠ లేదు.. ఎలాంటి ఉక్కిరి బిక్కిరీ లేదు. ఢిల్లీ ఓటర్లు స్పష్టతతో ఉన్నారు. స్పష్టమైన విధానంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఆది ఓటు నుంచే బీజేపీ పట్టుసాధించింది. ఉద్యోగులు.. రిటైర్డ్ ఉద్యోగులు.. సర్వీసు ఉద్యోగులు.. ఇలా అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు 70 శాతం మంది బీజేపీకి అనుకూలంగానే ఓటెత్తారు.
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీలో అధికారం చేపట్టేందుకు 36 స్థానాలు కావాల్సి ఉండగా.. తాజాగా వస్తున్న ట్రెండ్లలో బీజేపీ 45 స్థానాలకు మించి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక, గత ఎన్నికల్లో 69 స్థానాలు కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. కేవలం 23-24 స్థానాల మధ్య పరిమితం అయింది. అయితే.. ఈ ట్రెండు అటు ఇటు కొంత మారినా.. పెద్దగా తేడా ఉండకపోవచ్చని పరిశీకులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా మాస్ ఏరియాల్లో బీజేపీ పుంజుకుంది. ఇది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకును ప్రభావితం చేసింది. అంటే.. ఆప్ ఓట్లు గుండుగుత్తగా.. బీజేపీవైపు మళ్లాయి. అదేసమయంలో మద్య తరగతి ఉన్న చోట.. కూడా బీజేపీకి ఆశించిన విధంగానే ఓట్లు రాలుతున్నాయి. మొత్తంగా చూస్తే.. ఆది నుంచి పెద్ద ఉత్కంఠ నెలకొంటుందని.. తీర్పు కఠినంగా ఉంటుందని లెక్కలు వేసుకున్నా.. అదేమీ లేదన్నది స్పష్టమైంది. ఢిల్లీ ఓటరు ముందే డిసైడ్ అయినట్టు వ్యవహరించిన విషయం స్పష్టమైంది.