వైసీపీలోకి శైలజానాథ్.. ఆ లారీ డ్రైవర్ కు కష్టమే

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో.. సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చామంటూ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. తాను ఓ సామాన్య లారీ డ్రైవర్ కు అసెంబ్లీ సీటు ఇచ్చానని గొప్పలు చెప్పుకున్నారు. అయితే… ఇకపై అలాంటి సామాన్యులకు వైసీపీలో టికెట్లు దక్కే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే… సదరు లారీ డ్రైవరుకు ఇచ్చిన సీటులోకి ఇప్పుడు ఓ బడా రాజకీయ నేత వచ్చి కూర్చున్నారు. జగన్ కూడా ఆ బడా రాజకీయ నేతను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగిన సాకే శైలజానాథ్ శుక్రవారం కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరిపోయారు. శుక్రవారం తాడేపల్లికి వచ్చిన శైలజానాథ్ ను జగన్ వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు,. వైసీపీ కండువా కప్పి ఆయనకు జగన్ పార్టీలోకి స్వాగతం పలికారు. కాంగ్రెస్ లో ఉండగా శైలజానాథ్ అనంతపురం జిల్లా శింగనమల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ దఫా మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా కూడా పని చేశారు. ఆ తర్వాత ఎందుకనో గానీ ఆయన కనిపించకుండా పోయారు.

దివంగత సీఎం వై ఎస్ రాజశేఖర రెడ్డికి శైలజానాథ్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అంతేకాకుండా అనంత కు చెందిన మాజీ మంత్రి, ఏపీసీసీ చీఫ్ గా పనిచేసిన రఘువీరా రెడ్డికి కూడా ఆయన సన్నిహితులే. దళిత సామజిక వర్గానికి చెందిన శైలజానాథ్ కు మంచి పేరు అయితే ఉంది గాని… జనాన్ని మెప్పించగలిగే నేత అయితే మాత్రం కాదనే చెప్పాలి. మరి ఏ లెక్కన శైలజానాథ్ ను జగన్ పార్టీలోకి తీసుకున్నారన్న అంశంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో శింగనమల సీటునే జగన్ లారీ డ్రైవర్ కు ఇచ్చారు. ఇప్పుడు శైలజానాథ్ రాకతో ఆ సీటు శైలజానాథ్ కే ఇవ్వక తప్పదు. మరోమారు లారీ డ్రైవర్ కు ఆ సీటును జగన్ కేటాయించే అవకాశం లేదు.