టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం ప్రస్తావనకు వచ్చింది. పార్లమెంట్లోని పెద్దల సభ అయిన రాజ్యసభలో బాబు అంశాన్ని మాజీ ప్రధాని, జేడీయూ అధ్యక్షుడు దేవెగౌడ ప్రస్తావించారు. బాబు గురుంచి గౌడ చేసిన ప్రస్తావనపై బీజేపీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. వాస్తవాలు తెలుసుకోకుండా సభలో కీలక అంశాలపై ప్రస్తావించడం సరి కాదని బీజేపీ హితవాబు చెప్పింది.
అయినా… రాజ్యసభలో సభ్యుడు కాని చంద్రబాబుపై దేవెగౌడ ఏమన్నారన్న విషయానికి వస్తే… ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామి గా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్డీయేలో అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న పార్టీల్లో బీజేపీ తర్వాత స్తానం టీడీపీదే. ఈ క్రమంలో ఎన్డీయే చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని చంద్రబాబు కోరినట్టుగా గౌడ వ్యాఖ్యానించారు. అందుకు ప్రధాని మోడీ ససేమిరా అనడంతో… కనీసం వైస్ చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని చంద్రబాబు కోరారని ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదనకు కూడా మోడీ ససేమిరా అన్నారని గౌడ చెప్పారు. ఈ వ్యాఖ్యలు అక్కడికక్కడే కలకలం రేపాయి.
దేవెగౌడ ప్రసంగం సమయంలో సభలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెనువెంటనే స్పందించారు. చంద్రబాబు పదవులు ఆశించారంటూ దేవెగౌడ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్డీయేలో అసలు ఈ విషయాలే ప్రస్తావనకు రాలేదని కూడా నడ్డా తెలిపారు. చర్చకు రాని అంశాలు చర్చకు వచ్చినట్టుగా గౌడ చెప్పడం తనను ఆశ్యర్యానికి గురి చేసిందని అన్నారు.. అయినా చంద్రబాబు ఏపీ సీఎంగా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విషయాన్నీ నడ్డా మరోమారు గుర్తుచేశారు. గతంలో ఎన్డీయేకు చంద్రబాబు కన్వీనర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.