ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేసిన 22-ఏ భూముల వ్యవహారంతో పాటు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. దీంతోపాటు, సూపర్ సిక్స్ పథకాల అమలుపై కూడా మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు చర్చించనున్నారు. అయితే, ఈ కేబినెట్ భేటీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కాలేకపోవచ్చని డిప్యూటీ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ వల్ల ఇబ్బంది పడుతున్నారని, వైద్యుల సూచన ప్రకారం విశ్రాంతి తెలిపింది.
రేపటి నుంచి మొదలుకాబోతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో కూడా పవన్ పాల్గొనే చాన్స్ లేదని తెలుస్తోంది. మరోవైపు, రేపటి కేబినెట్ భేటీలో విశాఖ పంచగ్రామాల సమస్యపై కూడా చర్చ జరపబోతున్నారని తెలుస్తోంది. స్థానికులకు అంతే విలువ కలిగిన భూముల కేటాయించే విషయంపై చర్చించబోతున్నారట. అంతేకాదు, ఎస్ఐపీబీలో ఆమోదించిన రూ.44.776 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఉంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ నెల చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై కూడా మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు. ఏపీలో నోటిఫికేషన్ వెలువడిన రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిపరేషన్ పై మంత్రివర్గం చర్చ జరపనుంది. ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుతోపాటు పలు అంశాలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది.