రాజకీయ పార్టీ అధినేతలు.. నేతలు విమర్శలు చేయటం.. తీవ్ర ఆరోపణలు చేయటం మామూలే. అయితే.. దేశ చరిత్రలో ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ మీద తీవ్రమైన ఆరోపణ వచ్చింది లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కాస్త ముందుగా ఢిల్లీ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఆమ్ ఆద్మీ కన్వీనర్.. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీఈసీ ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయబోతున్నారని.. అందుకే బీజేపీకి సాగిలపడుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి ఏ స్థాయిలోదాసోహమైందంటే.. దేశంలో అసలు ఎన్నికల కమిషన్ లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని.. రాజీవ్ కుమార్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేస్తున్నారన్న కేజ్రీ.. “ఆ తర్వాత ఆయనకు ఏ పదవిని ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ పదవా? ఏకంగా రాష్ట్రపతి పదవినే ఇచ్చేస్తున్నారా? చేతులు జోడించి రాజీవ్ కుమార్ కు విజ్ఞప్తి చేస్తున్నా. మీ విధిని మీరు నిర్వర్తించండి. ఇంకా పదవులు చేపట్టాలనే దురాశను వదిలేసుకోండి. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయకండి. రాజీవ్ కుమార్ తన బాధ్యతల్ని నైతిక నిష్ఠతో నిర్వహించాలి. ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టి వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకోరాదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈవీఎంల ద్వారా బీజేపీ పది శాతం వరకు ఓట్లను రిగ్గింగ్ చేయొచ్చని పేర్కొన్న కేజ్రీవాల్.. మీరంతా ఓటింగ్ కు పెద్ద ఎత్తున తరలిరావాలి. ప్రతి ఓటూ చీపురుకట్టకే వేయాలి. 15 శాతం ఓట్ల అధిక్యత వస్తేనే.. వాళ్లు ఎన్ని అక్రమాలు చేసినా మనకు విజం ఖాయమవుతుంది. ఈవీఎంలను ఓడించాలంటే 10 శాతం.. ఆ పైన అధిక్యం మనకు అవసరం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇంతటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో సీఈసీ స్పందిస్తుందా? ఢిల్లీ ఓటర్లు ఎలా రియాక్టు అవుతారు? తమ తీర్పును ఎమని చెబుతారు? లాంటివి రానున్న రోజుల్లో తేలనున్నాయి. కేజ్రీవాల్ సంచలన ఆరోపణ మాత్రం దేశ ప్రజాస్వామ్యంలో ఎప్పటికి ఒక నలుసులానే ఉంటుందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates