తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ అసెంబ్లీకి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. ఏదో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి కాబట్టి తొలి రోజు సమావేశానికి వచ్చి ఆ 11 మంది మమ అనిపించారు.ఇక తెలంగాణలో అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులంతా ఎంచక్కా సభకు వస్తున్నారు. అధికార పక్షానికి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. అయితే ప్రదాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం అసెంబ్లీ గడప తొక్కట్లేదు. ఇదేం పద్దతి అంటూ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ అనే ఓ రైతు సంస్థ ఆయనను నిలదీసింది.
కేసీఆర్ ను ఆ సంస్థ నిలదీయడంతోనే వదిలిపెట్టలేదండోయ్… ఏకంగా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడిప్పుడే కాస్తంత బయటకు వద్దామని భావిస్తున్న కేసీఆర్ కు ఈ పరిణామం ఊహించనిదేనని చెప్పక తప్పదు. రాష్ట్రానికి బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి… అసెంబ్లీకి వచ్చి… రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాల్సిన మీరు అసలు అసెంబ్లీ ముఖమే ఎందుకు చూడట్లేదని సదరు నోటీసుల్లో ఆ సంస్థ ప్రశ్నించింది. అసెంబ్లీకి రాకపోవడం అంటే… ప్రదాన ప్రతిపక్ష నేత బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైనట్టేనని కూడా ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అక్కడితో సరిపెట్టని ఆ రైతుల సంస్థ… అసలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదన్న విషయాన్ని కేసీఆర్ నుంచి రాబట్టాలని స్పీకర్ కార్యాలయాన్ని డిమాండ్ చేసింది. ఇందుకోసం కేసీఆర్ కు సమన్లు జారీ చేయాలని కూడా కోరింది. కేసీఆర్ నుంచి ఆమోదించదగ్గ సమాధానం వస్తే సరేసరి.. లేదంటే ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఆ సంస్థ స్పీకర్ ను కోరింది. అసెంబ్లీ రాకుండా ఇప్పటికే కేసీఆర్ ఓ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హతను కూడా కోల్పోయారని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి విజయపాల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సంస్థ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి… నోటీసులను మెయిల్, స్పీడ్ పోస్టుల ద్వారా కేసీఆర్ కు పంపారు.