మీరే తేల్చుకోండి: రెండు రాష్ట్రాల విష‌యంలో కేంద్రం బంతాట‌!

విభ‌జ‌న హామీల అమ‌లు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వం బంతాట ప్రారంభించింది. మీరే తేల్చుకోండి! అని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఎవ‌రికి వారు పైచేయి మాదంటే మాద‌ని ల‌డాయించుకుంటే.. న‌ష్టం మీకే అని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి 2012-14 మ‌ధ్య రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌పైనా రెండు తెలుగు రాష్ట్రాలు విభేదించుకుంటున్నాయి. ఇప్ప‌టికి సుమారు ప‌దేళ్లు దాటినా.. విభ‌జ‌న చ‌ట్టంలో 9, 10 షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాల‌పై ఇత‌మిత్థంగా ఒక నిర్ణ‌యానికి రాలేక పోతున్నాయి.

దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు.. కేంద్రంపైనే తెలంగాణ‌, ఏపీ ఆధార‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జల వివాదాల‌కు సంబంధించి కొన్నాళ్ల కింద‌ట మొత్తం ప్రాజెక్టుల‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన కేంద్రం త‌ర్వాత‌.. వెన‌క్కి త‌గ్గింది. ఈ నేప‌థ్యంలో నే కృష్ణా ట్రైబ్యున‌ల్ -2ను ఏర్పాటు చేస్తూ.. నిర్ణ‌యించింది. ఈ వ్య‌వ‌హారంపై ఇంకా ఎటూ తేల‌కుండానే తాజాగా విభ‌జ‌న చ‌ట్టంలోని షెడ్యూల్ 9(ఆస్తులు), షెడ్యూల్ 10(సంస్థ‌లు) అంశాల‌పై మ‌రోసారి రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కేంద్రం చ‌ర్చ పెట్టింది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం కేంద్ర హోం శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన చ‌ర్చ‌ల్లో మీరే తేల్చుకోండి! అని వ్యాఖ్యానించింది.

కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి గోవింద్ మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో రెండు తెలుగురాష్ట్రాల ఉన్న‌తాధికారులు చ‌ర్చించారు. అయితే.. ఈ భేటీలోనూ ఎలాంటి నిర్ణ‌యం రాలేదు. పైగా కేంద్రం త‌న వంతు త‌ప్పుకొనే ప్ర‌య‌త్నం చ‌క్క‌గా చేసింది. “మీరు స‌మ‌న్వ‌యం ప‌రిష్క‌రించుకోవాలి. ఎవ‌రికి వారు పెద్ద అనుకుంటే.. మీకే న‌ష్టం. ఎక్కువ కావాల‌ని అంద‌రికీ ఉంటుంది. కానీ, దీనిని వ‌దులు కోవాలి. మీరు చేప‌ట్టే ప్రాజ‌క్టుల‌కు మా మ‌ద్ద‌తు(కేంద్రం) త‌ప్ప‌కుండా ఉంటుంది. కానీ.. పంప‌కాల విష‌యంలో మా ప్ర‌మేయం అంతంతే” అని వ్యాఖ్యానించారు. దీంతో ఇరు రాష్ట్రాల మ‌ధ్య పంప‌కాలపై తాజా చ‌ర్చ‌లు.. అసంపూర్తిగానే ముగిశాయి.

ఎందుకిలా?

బీజేపీ సార‌థ్యంలోని కేంద్ర కూట‌మి స‌ర్కారు.. విభ‌జ‌న అంశాల‌ను ఆది నుంచి రాజ‌కీయ కోణంలోనే చూస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వున్నాయి. అటు తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డుతోంద‌న్న చ‌ర్చ ఉంది. ఇక‌, ఏపీలో ఏకంగా కూట‌మి స‌ర్కారులో బీజేపీ భాగ‌స్వామిగా ఉంది. ఈ నేప‌థ్యంలో విభ‌జ‌న హామీల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. రాజ‌కీయంగా త‌మ‌కు ఇబ్బందేన‌న్న‌ది బీజేపీ నేత‌లు, కేంద్రంలో పెద్ద‌ల భావ‌న‌. అందుకే.. ఇలా ప‌దేళ్లుగా తాత్సారం చేస్తున్నార‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా. అంతేకాదు.. త్వ‌ర‌ప‌డి నిర్ణ‌యం తీసుకుంటే.. బీజేపీకి లాభించే ప్ర‌యోజ‌నం కూడా ఉండ‌ద‌ని అంటున్నారు. అందుకే.. క‌ట్టెవిర‌గ‌కుండా.. పాము చావ‌కుండా.. వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న కూడా ఉంది.