ఏపీ సీఎం చంద్రబాబు ఒక పని పెట్టుకున్నారంటే.. దాంతోనే సరిపుచ్చుకోరు. దానికి అనుబంధంగా ఉన్న ఇతర పనులను కూడా సర్దుకుని వస్తుంటారు. ఉన్న సమయాన్ని.. ఉన్న అవకాశాలను ఆయన ఎట్టి పరిస్థితిలోనూ వదులుకునే ప్రయత్నం చేయరు. అందుకే.. బాబు గ్రేట్ లీడర్ అనే టాక్ తెచ్చుకున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. ఆయన ఎందుకు వెళ్లారంటే.. కూటమిలో పెద్దన్నగా ఉన్న బీజేపీ తరఫున ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వెళ్లారనే సమాధానం వస్తుంది.
ఆయన ప్రచారం కూడా చేశారు. ఇంతటితో కథ ఎండ్. ఆ వెంటనే ఆయన ఓ పూట అక్కడే రెస్టు తీసుకుని.. ఫ్లైట్ ఎక్కేస్తే.. పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఎవరూ ఆయనను క్వశ్చన్ కూడా చేయరు. కానీ, అలా చేస్తే.. చంద్రబాబు ఎలా అవుతారు..? స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా చూసుకున్నారు. అంటే.. ఎవరికోసం హస్తిన వెళ్లారో.. అక్కడ వారి తరఫున ప్రచారం చేసిన చంద్రబాబు అది ముగియగానే.. ఏపీ గురించిన అంశాలపై దృష్టి పెట్టారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రయోజనాలపై ఆయన కీలక నేతలతో భేటీ అయ్యారు.
16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాతో తాజాగా చంద్రబాబు భేటీ అయ్యారు. వాస్తవానికి ఇది చంద్రబాబు షెడ్యూల్‌లో లేదు. అయినప్పటికీ.. ఆయన సమయం చిక్కగానే దానిని సద్వినియోగం చేసుకున్నారు. ఇక, పనగాడియాతో చంద్రబాబు భేటీ కూడా అనూహ్యమే. కేవలం 30 నిమిషాలని భావించిన ఈ సమావేశం.. ఏకంగా 2 గంటలపాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. గత ఐదేళ్ల పరిణామాలు, ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు టీడీపీ ఎంపీలు తెలిపారు.
ఇక, ఇదేసమయంలో పనగాడియాకు చంద్రబాబు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని ఎంపీలు పేర్కొన్నారు. నిజానికి పనగాడియా అంటే.. ప్రధాని తర్వాత.. అంతస్థాయి ఉన్న కీలక అధికారి. పైగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ కూడా! ఆయన చెప్పింది.. కేంద్రం చేసేందుకు మెజారిటీ అవకాశం ఉంది. ఈ నేపత్యంలోనే చంద్రబాబు ఒక కారణం కోసం ఢిల్లీకి వచ్చినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. అవకాశం చిక్కగానే దానిని సద్వినియోగం చేసుకుని స్వకార్యాన్ని కూడా చక్కగా పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates