తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా.. బీఆర్ఎస్ శ్రేణులు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం మధ్యాహ్నం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఆయన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కామెంట్లను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
తన ట్వీట్ లో కేటీఆర్ ఏమన్నారంటే… పార్టీ ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ ఇక ఎంతమాత్రం కాపాడుకోలేదు. చట్టాన్ని గుర్తు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉప ఎన్నికలు ఇక తథ్యమేనని తేలిపోయింది. వాటికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో దాదాపుగా 10 మంది ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
తమ పార్టీ గుర్తులపై పోటీ చేసి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన వారి సభ్యత్వాలను రద్దు చేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ ను కోరింది. స్పీకర్ కార్యాలయం నుంచి ఆశించిన మేర స్పందన కనిపించని నేపథ్యంలో…బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత వారం దీనిపై జరిగిన విచారణ సందర్భంగా స్పీకర్ కార్యాలయం చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడమంటే… చర్యలు తీసుకోవడానికి ఇంకెంత సమయం కావాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ గడువు అంటే మహారాష్ట్రలో మాదిరిగా అసెంబ్లీ కాలపరిమితి ముగిసే వరకా? అని కూడా కోర్టు ప్రశ్నించింది.