రాష్ట్రంలోని కూటమి సర్కారు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను మాత్రమే భర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్రమంలో సీఎం విచక్షణ మేరకు జరిగే సలహాదారుల నియామకం విషయంలో ఒకటి రెండు మాత్రమే ఇప్పటి వరకు జరిగాయి. కన్నయ్య నాయుడును జలవనరుల సలహాదారుగా గత ఏడాదే నియమించారు. ఇక.. ఆ తర్వాత.. పెద్దగా ఈ సలహాదారుల జోలికి పోలేదు. కానీ, ఇప్పుడు ఈ దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సలహాదారుల నియమకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
తాజాగా మాజీ ఐపీఎస్ ఆర్ . పీ. ఠాకూర్‌ను సలహాదారుగా నియమించారు. ఆయన .. 2017-19 మధ్య రాష్ట్రానికి డీజీపీగా పనిచేశారు. ముఖ్యంగా అప్పట్లో జగన్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో ఎదరైన కోడికత్తి ఘటన సమయంలో ఈయనే డీజీపీగా ఉన్నారు. దీనిని డిపెన్స్ చేసుకోవడంలోనూ. సర్కారుపై మరకలు పడకుండా కాపాడుకునే విషయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆ తర్వాత జగన్ సర్కారు ఆయనను ఆ పదవి నుంచి తీసేసి.. ఆర్టీసీ ఎండీగా నియమించింది. అక్కడే ఆయన రిటైర్ అయ్యారు.
తాజాగా ఠాకూర్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించిన చంద్రబాబు.. ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ పరంపరలో చంద్రబాబు హయాంలోనే డీజీపీగా పనిచేసి రాముడును కూడా.. త్వరలోనే ఏపీకి తీసుకురానున్నారు. ఈయనను కూడా సలహాదారుగా నియమించే అవకాశం ఉంది. ఇక, 2019 ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురైన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాకు కూడా వర్తమానం పంపించారు. ఆయనకు ఇష్టమైతే.. రాష్ట్రంలో సచివాలయాల సలహాదారుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వీరితో పాటు.. మరికొందరు సీనియర్ అధికారులను కూడా నియమించే దిశగా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఐపీఎస్‌గా పనిచేసిన అనురాధను..ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె భర్త.. మాజీ ఐపీఎస్ నిమ్మగడ్డ సురేంద్ర బాబును కూడా కీలక పోస్టుకు సలహాదారుగా నియమించే ఉద్దేశం ఉందని తెలుస్తోంది. అలానే.. మాజీ ఐఏఎస్.. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను చేసే దిశగా కూడా చర్చలు సాగుతున్నాయని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో సలహాదారుల నియామకం.. ఈ నెలలో జోరుగా సాగనున్నట్టు తెలుస్తోంది.