ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురై.. దాదాపు ఐదేళ్లపాటు సస్పెన్షన్ లో ఉన్న ఆలూరి బాల వెంకటేశ్వరావు(ఏబీవీ) వ్యవహారం.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు ఇజ్రాయెల్ నుంచి అక్రమ వ్యాపారం చేశారని ఆరోపిస్తూ.. వైసీపీ హయాంలో సస్పెండ్ చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. అదేవిధంగా క్యాట్‌ను కూడా ఆశ్రయించారు. దీంతో ఆయనకు ఉపశమనం లభించింది. అయినప్పటికీ వైసీపీ సర్కారు తన కక్ష సాధింపులు కొనసాగించింది.
కోర్టు ఆదేశాలతో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమించినా.. తర్వాత విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మరోసారి ఆయనను సస్పెండ్ చేసింది. అయితే.. తనకు కనీసం సగం జీతమైనా ఇవ్వాలని.. తన కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని ఏబీవీ పలు మార్లు విన్నవించారు. కానీ, పట్టించుకోలేదు. ఇక, రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఏబీవీ పై ఉన్న అన్ని కేసులను కోర్టులు కొట్టేశాయి. దీంతో వైసీపీ హయాంలోనే ఆయన తన పదవీ విరమణకు చివరి రోజు పోస్టు తెచ్చుకున్నా రు. కానీ, అదే రోజు ఆయన పదవీ విరమణ పొందారు.
కూటమి సర్కారు కొలువు దీరిన తర్వాత.. ఇటీవల ఏబీవీకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఆయన పై నమోదు చేసిన కేసులు వీగిపోయిన నేపథ్యంలో ఆయన సస్పెన్షన్ కాలానికి సంబంధించిన పూర్తి వేతనం ఇవ్వడంతోపాటు ఇతర భత్యాలు కూడా చెల్లించాలని ఆదేశించింది. దీంతో సుమారు 50 లక్షల రూపాయలకు పైగానే ఏబీవీకి ఆర్థిక శాఖ అందించింది. ఇప్పుడు మరోసారి.. చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిటైరైన ఏబీవీకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆఫర్ చేశారు. ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వాస్తవానికి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. గతంలో విజయవాడ కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు నాగుల్ మీరా చైర్మన్‌గా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన క్యూలో ఉన్నారు. అదే విధంగా మరో మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన కృష్ణాజిల్లాకు చెందిన నాయకుడు కూడా.. బరిలో ఉన్నారు. అయినప్పటికీ.. ఏబీవీ కి ఈ పదవిని ఇస్తూ..సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన నియామకం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదవి చేపట్టి సమయం నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates