కేంద్ర బ‌డ్జెట్.. బాబు హ్యాపీ!

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే స‌ర్కారు భాగ‌స్వామి చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. స‌మ్మిల వృద్ధికి, విక‌సిత్ భార‌త్ సాకారానికి ఈ బ‌డ్జెట్ ప్ర‌తిరూపంగా నిలుస్తుంద‌ని తెలిపారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌వ‌చిస్తున్న విక‌సిత భార‌త్ ఈ బ‌డ్జెట్‌లో స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని చెప్పారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవుల‌కు ప‌న్ను ఊర‌ట క‌ల్పించ‌డం.. కీల‌క అంశంగా ఆయ‌న పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న ప‌న్ను మిన‌హాయింపుల‌పై సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న చేశార‌ని తెలిపారు. ఇది అన్ని వ‌ర్గాల‌కు సంతోష‌క‌ర‌మైన బ‌డ్జెట్ అని పేర్కొన్నారు.

వృద్ధికి ప్రాదాన్యం ఇస్తూ.. ఆరు రంగాల‌ను ప్ర‌స్తావించార‌ని చంద్ర‌బాబు తెలిపారు. ప్ర‌ధానంగా ప‌ట్ట‌ణ‌, గ్రామీణ పేద‌ల‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు, ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రాధాన్యం ఇచ్చార‌ని చెప్పారు. “పేద‌లు, యువ‌త‌, రైతులు, మ‌హిళ‌ల సాధికార‌త‌కు.. అభివృద్ధికి… ఈ బ‌డ్జెట్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది” అని చంద్ర‌బాబు కొనియాడారు. దేశ ప్ర‌యోజ‌నాల‌ను ఈ బ‌డ్జెట్ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించింద‌న్నారు. “దేశాభివృద్ధిని కాంక్షిస్తూ.. దేశాన్ని సుసంప‌న్నం చేసే దిశ‌గా రూపొందించిన బ్లూ ప్రింటే2025-26 బ‌డ్జెట్‌” అని చంద్ర‌బాబు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఏంపీల‌కు ప్ర‌శంస‌లు!

దేశంలోని ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలనేది ప్రధాని ఆలోచనగా ఉంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలిసింద‌ని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగమ‌య్యాయ‌ని, 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఏపీకి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేశార‌ని టీడీపీ ఎంపీల‌పై ప్ర‌శంస‌లు గుప్పించారు. ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెచ్చార‌ని పేర్కొన్నారు. పౌరవిమానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఉడాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని, దీనిద్వారా గిరిజ‌న ప్రాంతాలైన అర‌కు, పాడేరుల‌లో విమానాశ్ర‌యాలు వ‌స్తాయ‌ని, త‌ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి సాకారం అవుతుంద‌న్నారు. ఏపీలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయన్నారు.