గ‌రీబ్‌-యువ‌-నారీ-కిసాన్‌.. బ‌డ్జెట్లో నాలుగు యాంగిల్స్‌!

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ప్ర‌ధానంగా నాలుగు యాంగిల్స్ క‌నిపించాయి. ఈ విష‌యాన్ని బ‌డ్జెట్ ప్ర‌సంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా ప్ర‌స్తావించారు. నిజానికి బ‌డ్జెట్‌లో ఎప్పుడూ.. ప్రాజెక్టులు, అభివృద్ధికి పెద్ద పీట వేసిన మోడీ.. ఈ ద‌ఫా విక‌సిత భార‌త్ ల‌క్ష్యంగా రూపొందించిన‌ట్టు నాలుగు యాంగిల్స్‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది. బ‌డ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉన్నా.. స‌మాజాన్ని ప్ర‌భావితం చేస్తున్న‌ది ఈ నాలుగు కోణాలే. అవే.. గ‌రీబ్‌.. పేద‌లు, యువ‌.. యువ‌త‌, నారీ.. మ‌హిళ‌లు, కిసాన్‌.. అన్న‌దాత‌లు! ఈ నాలుగు వ‌ర్గాలు స‌మాజాన్ని త‌ద్వారా దేశాన్ని కూడా ప్ర‌భావితం చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తిసారీ.. ఆర్థిక నిపుణులు.. యువ‌త‌, మ‌హిళ‌లు, రైతుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని చెబుతున్నారు. అయితే.. ప్ర‌తిసారీ.. కేంద్రం ఈ వ‌ర్గాల‌పై శీత‌క‌న్ను వేస్తూనే ఉంది. కానీ, ఈ ద‌ఫా మాత్రం ‘విక‌సిత భార‌త్’ ల‌క్ష్యాల‌ను సాధించాల‌న్న సంక‌ల్పం బ‌లంగా పెట్టుకున్న నేప‌థ్యంలో పేద‌లు, యువ‌త‌, మ‌హిళ‌లు, అన్న‌దాత‌ల‌పై కేంద్రం వ‌రాల జ‌ల్లు కురిపించింది. వీరితోపాటు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు కూడా ఈ ద‌ఫా ప్రాధాన్యం ఇచ్చింది. త‌ద్వారా.. ఆయా వ‌ర్గాల‌కు.. నేరుగా కాకున్నా.. ప‌రోక్ష ల‌బ్ధిని పెంచి.. అభివృద్ధి దిశ‌గా న‌డిపించే ప్ర‌య‌త్నం చేసింది.

యువ‌త‌: ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువ‌త‌కు.. ఉన్న‌త విద్యా అవ‌కాశాల‌ను పెంచుతూనే.. మ‌రోవైపు పారిశ్రామికంగా వారు ఎదిగేందుకు ఎం.ఎస్‌.ఎం.ఈల ద్వారా కొత్త ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తోంది. వీరికి ఇచ్చే రుణాల‌ను 100 శాతం పెంచింది.

మ‌హిళ‌లు: మ‌హిళ‌ల‌కు.. పెద్ద ఎత్తున వ‌రాలు గుప్పించారు. సాధికార‌త‌కు పెద్ద‌పీట వేశారు. చేప‌లు, పాల ఉత్ప‌త్తులు త‌దిత‌ర రంగాల్లో మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్ప‌న‌, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా బ్యాంకురుణాలు, పొదుపు, డ్వాక్రా సంఘాల బ‌లోపేతానికి రుణాల‌ను పెంచారు. మ‌హిళా విద్య‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

కిసాన్‌: దేశ‌వ్యాప్తంగా రైతుల‌కు రుణాల ప‌రప‌తిని పెంచుతూ.. బ‌డ్జెట్‌లో కీల‌క ప్ర‌తిపాద‌న‌లు చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డ‌ల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. వీటి ద్వారా రైతులు20 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఒక ఏడాదిలో అప్పు తెచ్చుకునే సౌల‌భ్యం క‌ల్పించారు.

గ‌రీబ్‌: కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న స‌మ‌యాన్ని మ‌రో ఏడాది పెంచారు. అదేవిధంగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని పేద‌ల‌ను రెండుగా విభ‌జించి.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రుణాలు, ప‌ట్ట‌ణ పేద‌ల‌కు ఇళ్ల‌ను ఇచ్చేలా కేంద్రంలో ప్ర‌క‌ట‌న చేశారు. మొత్తంగా చూస్తే.. నాలుగు యాంగిళ్ల‌లోనూ.. నాలుగు వ‌ర్గాల‌కు మేలు చేసేలా కేంద్రం ప్ర‌యత్నం చేస్తోంది.