కేంద్ర బడ్జెట్ లో ఏపీకి దక్కిందేంటి…?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో నూతన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్ లో కీలక రంగాలకు భారీ కేటాయింపులే జరిగాయి. అయితే తెలుగు నేల విభజన నాటి నుంచి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పయనం సాగిస్తున్న ఏపీకి ఈ బడ్జెట్ లో అయినా ఆశించిన మేర కేటాయింపులు దక్కాయా? అన్న దిశగా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. 

బడ్జెట్ లో నిర్మలమ్మ ఏపీకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టు సహా పలు అంశాలకు నిధులను కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన అంచనాలకు ఆమోదం తెలుపుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ లెక్కన రూ.30,436.95 కోట్ల మేర నిధులు కేంద్రం నుంచి అందనున్నాయి. అంతేకాకుండా ఇదివరకే విడుదల చేసిన రూ.12 వేల కోట్లను ప్రస్తావించిన నిర్మలమ్మ… కొత్తగా పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్ లో రూ.5,936 కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు అధారిటీకి రూ.54 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇక పోలవరం ప్రాజెక్టు బ్యాలెన్స్ గ్రాంట్ ను రూ.12,157.53 కోట్లుగా ప్రకటించారు. 

నిర్మలమ్మ బడ్జెట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.3,295 కేటాయించారు. అదే సమయంలో విశాఖ పోర్టుకు కూడా రూ.730 కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లను కేటాయించారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కోసం రూ.186 కోట్లను కేటాయించారు. లెర్నింగ్ ట్రాన్స్ ఫార్మేషన్ ఆపరేషన్ కు మద్దతుగా రూ.375 కోట్లను కేటాయించారు. రాష్ట్రంలో వంతెనలు, రోడ్ల అభివృద్ధికి రూ.240 కోట్లను కేటాయించారు. ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీ హుడ్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి.

ఇ్లక జీవన్ మిషన్ ను  2028 వరకు పొడిగిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. ఈ పథకం అమలును జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం కింద పవన్ భారీ ఎత్తున కేంద్రం నుంచి నిధులను రాబట్టగలిగారు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించారంటే… రానున్న మూడేళ్లలోనే పవన్ కేంద్రం నుంచి ఓ రేంజిలో నిధులను రాబడతారన్న అంచనాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో సంస్కరణలను అమలు చేసే రాష్ట్రాలకు ఇతోదికంగా సాయం చేస్తామన్న నిర్మల ప్రకటన కూడా ఏపీకి నిధుల వరదను తీసుకొస్తుందని చెప్పక తప్పదు.