రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ చోటే లేదు. దేశ రాజధాని ఢిల్లీ నడి వీధుల్లో సువిశాల విస్తీర్ణంలో వందలాది గదులతో రాజ ప్రసాదాన్ని తలపించేలా నిర్మితమైన ఈ భవన్ ను ఒక్కసారి అయినా దర్శించి తీరాలని కోరుకోని భారతీయుడు ఉండరు. అలాంటి రాష్ట్రపతి భవన్ లో ఇప్పుడు ఓ పెళ్లి వేడుక జరగనుంది. ఈ వేడుకకు స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు.
ఈ నెల 12న రాష్ట్రపతి భవన్ వేదికగా అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహ వేడుకలో ముర్ముకు వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేస్తున్న పూనమ్ గుప్తా… తన సహచరుడు సీఆర్ పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తున్న అవనీశ్ కుమార్ ను మనువాడనున్నారు. వాస్తవానికి పూనమ్ గుప్తా కూడా సీఆర్ పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు. అయితే రాష్ట్రపతి ముర్ముకు వ్యక్తిగత భద్రతా అధికారిగా ఆమె డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు.వెరసి వధూవరులిద్దరూ సీఆర్ పీఎఫ్ అధికారులే. ఈ కారణంగానే వీరి పెళ్లి వేడుకకు రాష్ట్రపతి భవన్ వేదికగా నిలుస్తోందని సమాచారం.
వాస్తవానికి రాష్ట్రపతి భవన్ లో ఇప్పటిదాకా ఓ ప్రైవేట్ కార్యక్రమం అన్నది జరిగిందే లేదు. ఎందరో రాష్ట్రపతులు, మరెందరో ప్రదానులు మారినా కూడా అందరూ రాష్ట్రపతి భవన్ విశిష్టతను కాపాడుతూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న ఇద్దరు కూడా దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్న సీఆర్ పీఎఫ్ అధికారులు కావడం.. వారిలో ఒకరు నేరుగా రాష్ట్రపతి ముర్ముకు పర్సనల్ సెక్యూరిటీ ఆపీసర్ గా పనిచేస్తున్న కారణంగా రాష్ట్రపతి భవన్ వీరి వివాహ వేడుకకు వేదికగా నిలుస్తోంది. రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్ లో ఈ శుభకార్యం జరగనుంది.