భారత్ లో డ్రోన్ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ లోనూ ఏపీలోని కూటమి సర్కారు డ్రోన్ టెక్నాలజీకి ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అమరావతిలో డ్రోన్ టెక్నాలజీపై జాతీయ సదస్సును నిర్వహించిన సీఎం నారా చంద్రబాబునాయుడు..ఈ రంగానికి బూస్ట్ ఇచ్చే ప్రకటనలు చేశారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు 300 ఎకరాలను కేటాయిస్తూ కీలక ప్రకటన చేశారు.
ఈ ప్రకటన డ్రోన్ టెక్నాలజీ రంగంలో ఉన్న పలు కంపెనీలను బాగానే టెంప్ట్ చేశాయని చెప్పాలి. చంద్రబాబు ప్రకటన, ఓర్వకల్లులో ప్రభుత్వం కేటాయించిన భూములు, ఏపీలో పెట్టుబడులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితరాలపై ఆయా కంపెనీలు దృష్టి సారించాయి.
ఈ పరిశీలనలను అందరికంటే ముందుగా పూర్తి చేసుకున్న చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ కంపెనీ అధినేత అగ్నీశ్వర్ జయప్రకాశ్… గురువారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. డ్రోన్ సిటీ ఏర్పాటు దిశగా తాము ఓ ప్రాజెక్టు చేపట్టాలనుకుంటున్నామని… అందుకోసం తమ వంతుగా రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ డ్రోన్ సిటీని కేవలం ప్రైవేట్ కంపెనీలు మాత్రమే డెవలప్ చేయడం సాధ్యం కాదని చెప్పిన జయప్రకాశ్… అందుకు కేంద్రం తరఫున సహకారం అందించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా డ్రోన్ టెక్నాలజీపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ సాగింది. ఓర్వకల్లులో ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూములు… అక్కడ డ్రోన్ టెక్నాలజీ సంస్థలకు గల అవకాశాలప వారి మధ్య చర్చ జరిగింది.
జయప్రకాశ్ ప్రతిపాదనకు రామ్మోహన్ నాయుడు అక్కడికక్కడే ఓకే చెప్పేశారు. అంతేకాకుండా ఏపీలోనే సదరు డ్రోన్ సిటీని డెవలప్ చేసే దిశగా కూటమి సర్కారుతో చర్చిద్దామని కూడా మంత్రి ఆయనకు జయప్రకాశ్ కు హామీ ఇచ్చారు. అన్నీఅనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలో ఈ పెట్టుబడులు ఏపీకి రావడం ఖాయమనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates