ఒకవైపు వైసీపీ నుంచి వ్యతిరేక వ్యాఖ్యలు. ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని.. ఇక, చేయదని .. చంద్రబాబు పేదలకు వ్యతిరేకమని వార్తలు, వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికితోడు సోషల్ మీడియాలో మరింతగా వైసీపీ వ్యతిరేక ప్రచారం చేస్తోంది. దీంతో సర్కారు ఎంత చేస్తున్నా.. ప్రజల మధ్య పెద్దగా చర్చకు రావడం లేదు. ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తేనో.. లేక కార్యక్రమాన్ని చేపడితేనో.. ఆ ఒకటి రెండు రోజులు మాత్రమే ప్రజల మధ్య చర్చవస్తోంది.
కానీ, ఆ తర్వాత కూడా.. ప్రజలను కలుసుకుని సదరు పథకాలపై వారికి మరింత లోతుగా వివరించాలన్నది సీఎంగా చంద్రబాబు పార్టీ నాయకులకు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేస్తున్న కృషిని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని ఆయన పరోక్షంగా ఆదేశిస్తున్నారు. అయినప్పటికీ.. చాలా మంది కాలు కదపరు – వాయిస్ పెంచరు. కానీ, రాజకీయాల్లో మాత్రం తమకు పదవులు కావాలని పోరుపెడుతున్నారు.
ఈ వ్యవహారమే చంద్రబాబుకు మంట పుట్టిస్తోంది. అనేక రూపాల్లో ఆయన నాయకులను ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా హెచ్చరిస్తున్నారు. పనిచేసే వారికే పదవులని కూడా చెబుతున్నారు. ఎంత సీనియర్ అయినా.. ప్రజల మధ్యకువెళ్లాలని చెబుతున్నారు. ఇక, నారా లోకేష్ అయితే.. యువతకు ప్రాధాన్యం ఇస్తామంటూ.. పరోక్షంగా సీనియర్లపై ఆయన గుర్రుగా ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కానీ, ఇంత జరుగుతున్నా.. సీనియర్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ఇక, జూనియర్ల సంగతి వేరేగా ఉంది. వారు వివాదాలకు సై అంటున్నారు. దీంతో పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ.. ప్రభుత్వం తరఫున చేపడుతున్న కార్యక్రమాలు కానీ.. ఏదో నామ్‌కే వాస్తే.. అన్నట్టుగా జరిగిపోతున్నాయి. ఇది అనుకున్న విధంగా అయితే.. చంద్రబాబుకు మైలేజీ రావడం లేదన్నది అంతర్గతంగా చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లను వదిలించుకోవడమా.. లేక, వారిని పిలిచి క్లాస్ తీసుకోవడమా? అనే విషయంపై చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates