గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘోర పరాభవం చవిచూసిందో తెలిసిందే. వైసీపీ ఓటమి ఖాయమని ఎన్నికలకు ముందే సంకేతాలు కనిపించాయి కానీ.. మరీ ఆ స్థాయిలో చిత్తవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దీంతో కొన్ని నెలల పాటు ఈవీఎం మాయాజాలం అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. కార్యకర్తలను కూడా అదే రకంగా నమ్మించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ రోజులు గడిచేకొద్దీ వాస్తవాలు బోధపడుతున్నాయి ఆ పార్టీ నేతలకు. తమ ప్రభుత్వంలో జరిగిన తప్పులను కొందరు నేతలు అంగీకరిస్తున్నారు.
వైసీపీ నుంచి కచ్చితంగా గెలిచే నేతల్లో ఒకరిగా పేరుండి కూడా ధర్మవరం నుంచి పరాజయం పాలైన పాపులర్ లీడర్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం ఇప్పుడు స్వరం మారుస్తున్నారు. ఎన్నికల అనంతరం ఈవీఎం గోల్ మాల్ అంటూ ఆరోపణలు చేసిన నేతల్లో కేతరెడ్డి కూడా ఒకరు. కానీ ఇప్పుడు ఆయన ఓటమికి దారి తీసిన కారణాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి ప్రధానమైన కారణాలు కొన్ని చెప్పారు కేతిరెడ్డి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌ల మీద సానుభూతి రావడానికి.. ఆయా పార్టీల కార్యకర్తల్లో ఐకమత్యం రావడానికి దారితీసిన పరిస్థితుల గురించి కేతిరెడ్డి ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం పెద్ద తప్పిదమని కేతిరెడ్డి అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలనుకుంటే.. ఇంకో ఆరు నెలల తర్వాత, మళ్లీ అధికారంలోకి వచ్చాక చేయాల్సిందని.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆ పని చేయడం వల్ల ఆయనకు ప్రజల్లో సానుభూతి వచ్చిందని.. అంతేకాక టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు కులస్థులు పోలరైజ్ అయ్యారని కేతిరెడ్డి అన్నారు. అలాగే టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ నేతలు దాడి చేయడం కూడా ప్రభుత్వానికి ప్రతికూలంగా మారిందని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. తన సతీమణి భువనేశ్వరి మీద చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం కూడా ఆయన కమ్యూనిటీ పోలరైజ్ కావడానికి దోహదపడిందని ఆయనన్నారు.
అలాగే పవన్ కళ్యాణ్‌ను హ్యాండిల్ చేయడంలో కూడా తమ ప్రభుత్వం విఫలమైందన్నారు. వైజాగ్‌లో ఆయన్ని అడ్డగించడం లాంటి సంఘటనలతో ఆయన కమ్యూనిటీ, కార్యకర్తలు పోలరైజ్ కావడం జరిగిందని.. ఈ సంఘటనలే తమ కొంపముంచాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఎప్పుడూ వ్యాపారం చేయకూడదని.. ఇసుక, మద్యం పాలసీల విషయంలో తమ ప్రభుత్వం తప్పు చేసి వ్యతిరేకత తెచ్చుకుందని.. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తోందని కేతిరెడ్డి అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates