ఆమెను వైసీపీలో ఎవరు పట్టించుకోవటం లేదట !

శ్రీకాకుళం మాజీ ఎంపి, కేంద్ర మాజీమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి గుర్తింపు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా ? అధికారపార్టీలోనే ఉన్నా అనుకున్నంత గుర్తింపు రావటం లేదా ? కిల్లి విషయాన్ని ఆరాతీస్తే పార్టీ నేతల్లోనే ఈ విషయాలు చర్చ జరుగుతున్నాయి. జిల్లా పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు, మంత్రులు, ఎంఎల్ఏలు కిల్లిని ఏమాత్రం పట్టించుకోవటం లేదట. ఆధిపత్య సమస్యలతోనే మాజీమంత్రికి పార్టీలోని చాలామంది సీనియర్ నేతలతో ఏమాత్రం పడటం లేదని టాక్.

ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయనే సామెతకు కిల్లి ప్రస్తుత పరిస్ధితే తాజా ఉదాహరణగా పార్టీలో చెప్పుకుంటున్నారు. అసలు డాక్టర్ ను వైసిపిలోకి చేర్చుకోవటమే చాలామంది నేతలకు ఇష్టం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఎంపిగా కేంద్రమంత్రిగా ఓ వెలుగు వెలుగుతున్న కాలంలో చాలామంది వైసిపి నేతలను డాక్టర్ లెక్కచేయలేదు. పైగా అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం-జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాల కారణంగా వైసిపి నేతలను తొక్కేయటానికి కూడా కిల్లి గట్టిగా ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలున్నాయి.

2014 ఎన్నికల్లో పార్టీతో పాటు ఈమె కూడా ఘోరంగా ఓడిపోయిన తర్వాత కానీ డాక్టర్ నేలమీదకు దిగిరాలేదు. తర్వాత కూడా కొంతకాలం కాంగ్రెస్ నేతగానే చెలామణి అయినా రాజకీయ భవిష్యత్తు ఉండదని అర్ధమైపోయింది. మొత్తానికి 2019 ఎన్నికలకు ముందు మాత్రమే కిల్లి వైసిపిలో చేరారు. వైసిపి అధికారంలోకి వచ్చేస్తుందన్న సంకేతాలు బలంగా కనిపించిన తర్వాత మాత్రమే కిల్లి వైసిపి వైపు మొగ్గు చూపలేదు. సరిగ్గా ఈ పాయింట్ మీదే ఈమెను పార్టీలోకి చేర్చుకునే విషయంలో చాలామంది నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా అప్పటి పరిస్దితుల కారణంగా జగన్ డాక్టర్ ను పార్టీలోకి చేర్చుకున్నారు.

జిల్లాలోని కీలక నేతలైన ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రి సీదిరి అప్పలరాజుతో పెద్ద సఖ్యత లేదట. పైగా సోదరుడు ప్రసాదరావుతో పడని కారణంగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా కిల్లిని దూరంగానే పెట్టేశాడని పార్టీలోనే టాక్ నడుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా తనను జగన్ గుర్తించటం లేదనే అసంతృప్తి అంతకంతకు పెరిగిపోతోంది. తనను పిలిచి పదవులు కట్టబెడతారని ఇంతకాలం ఎదురు చూసిన కిల్లికి వాస్తవం ఇపుడిప్పుడే అర్ధమవుతోందట. ఏం చేస్తుంది పాపం అసంతృప్తిని బయటపెట్టుకోలేందు అలాగని ఎవరి మీద ప్రదర్శించలేందు. అందుకనే మద్దతుదారుల దగ్గర తనలోని అసంతృప్తిని బయటపెట్టుకుంటోందట.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)