ఏపీ కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి సర్కారు మరో తీపి కబురు చెప్పింది. వైసీపీ పాలనలో ఏబీవీపై రెండు పర్యాయాలు సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ సస్పెన్షన్లను క్రమబద్ధీకరిస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సస్పెన్షన్ కాలంలో ఏబీవీ కోల్పోయిన ఆర్థికపరైన నష్టం పూర్తిగా భర్తీ కానుంది. అంటే… సస్పెన్షన్ కాలానికి చెందిన వేతనాలు, ఇతర అలవెన్సులు ఇప్పుడు ఆయనకు అందనున్నాయి.
2019 ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీవీపై వైసీపీ దాదాపుగా కక్ష కట్టినంత పనిచేసింది. ఓ రాజకీయ నేతపై చేసే ఆరోపణలను మించి ఏబీవీని వైసీపీ టార్గెట్ చేసింది. నాడు విపక్షంగా తమపై ఏబీవీ నిఘా పెట్టారని, అందుకోసం ఏకంగా ఇజ్రాయెల్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలను కొనుగోలు చేశారని స్వయంగా జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఏబీవీకి కష్టాలు మొదలయ్యాయి.
జగన్ సీఎం కుర్చీలో కూర్చున్నంతనే ఏబీవీని బదిలీ చేసిన నాటి రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా చాలా కాలం పాటు ఉంచేసింది. ఆ తర్వాత నిఘా పరికరాల కొనుగోలు కేసు నమోదు చేసి ఆయనను ఏకంగా సస్పెండ్ చేసింది. అయితే ఏబీవీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై న్యాయ పోరాటానికి దిగారు. ఈ క్రమంలో ఏబీవీపై విధించిన సస్పెన్షన్ కాలం ముగియగానే… ఆయనపై మరోమారు సస్పెన్షన్ వేటు వేసింది. చివరకు సుప్రీంకోర్టులో ఏబీవీకి అనుకూలంగా తీర్పు వచ్చినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. చివరకు రిటైర్మెంట్ చివరి రోజున ఏదో అలా ఓ పోస్టింగ్ ఇచ్చి ఆయన పదవీ విరమణ పొందేలా చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates