సబ్బం హరి టీఆర్పీ తగ్గిపోతోందా?

రాజకీయ నాయకుడిగా కంటే విశ్లేషకుడిగా ఎక్కువ ప్రచారంలో ఉన్న మాజీ ఎంపి సబ్బంహరి వైఖరి రోజురోజుకు విపరీతంగా మారిపోతోంది. వివిధ కారణాలతో జగన్మోహన్ రెడ్డిపై తనలో పేరుకుపోయిన కసిని ఆరోపణలు, విమర్శల రూపంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రిపై సబ్బం చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు మీడియాలో బాగా ప్రయారిటి ఇస్తుండటంతో ఈయన మరింత ఉత్సాహం తెచ్చుకుని మాట్లాడుతున్నారు. తాజాగా సబ్బం చేసిన వ్యాఖ్యలేమిటంటే 2021 లో జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోతారట. భార్య భారతి కానీ లేకపోతే తల్లి విజయమ్మ కానీ సిఎం అవుతారని జోస్యం చెప్పేశారు.

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసుల్లో జగన్ జైలుకెళ్ళటం ఖాయమని కూడా బల్లగుద్ది మరీ చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న న్యాయవ్యవస్ధపై జగన్ రాసిన లేఖపైన కూడా స్పందించేశారు. న్యాయవ్యవస్ధలోని ప్రముఖులపై జగన్ లేఖ రాయటం తప్పని సబ్బం తేల్చేశారు.

ఒకపుడు ఇదే సబ్బం వైసీపీలో చాలా కీలకంగా ఉన్నారు. కానీ అధినేతతో గొడవల కారణంగా పార్టీకి దూరమైపోయారు. ఆ తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదట. అప్పటి నుండి చాలా కాలం ఇంటికే పరిమితైపోయారు. ఆ తర్వాతెప్పుడో టీడీపీలో చేరారు. అప్పటి నుండి తనదైన శైలిలో జగన్ పై ప్రతిరోజు విరుచుకుపడిపోతున్నారు. తరచుగా మాట్లాడటం వల్ల ఆకర్షణ తగ్గిపోవడం సహజమే. సబ్బం విషయంలో జరుగుతున్నది అదే. సబ్బం తన ఆరోపణలు, విమర్శలను ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా అని కూడా చూసుకుంటున్నట్లు లేదు.

ఇదే విషయమై వైసీపీ నేతలు మాట్లాడుతూ సబ్బంను ఓ అవుట్ డేటెడ్ నేతగా ఎద్దేవా చేస్తున్నారు. విశాఖను రాజధానిగా ఎవరు కోరుకోవటం లేదని సబ్బం ఏ ఆధారాలతో చెబుతున్నారని నిలదీస్తున్నారు. ఏరోజైనా రాజధాని అంశంపై సబ్బం ప్రజల్లో సర్వే నిర్వహించారా అంటూ ప్రశ్నించారు. నిజంగానే సబ్బం చెప్పేది కరెక్టయితే ఇదే విషయమై ఓ బహిరంగసభ నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. సబ్బం చెప్పిందే కరెక్టయితే టీడీపీ నుండి నేతలు ఎందుకు రాజీనామాలు చేసి వైసీపీలో చేరుతున్నారో చెప్పాలంటూ చాలెంజ్ విసిరారు. ఇంట్లో కూర్చుని తనకు కావాల్సిన మీడియాతో చర్చల్లో మాట్లాడటం కాదని రోడ్లపైకి వచ్చి జనాల్లో తిరిగితేనే జనాభిప్రాయం ఏమిటో తెలుస్తుందంటూ సవాలు విసురుతున్నారు.