కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తల్లికి వందనం పథకం అమలు కాకపోవడంపై విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వంపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఇక, అన్నదాత సుఖీభవ పథకం అమలు కాకపోవడంతో రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
డబ్బులుంటే పథకాలు అమలు చేయడానికి నిమిషం ఆలస్యం చేయబోనని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఏ మాత్రం ఫ్లెక్సిబిలిటీ దొరికినా పథకాలు అమలు చేస్తానని చెప్పారు. అయితే, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం, ఏడీబీ బ్యాంకు నిధులు కేటాయించాయని, కానీ, ఆ నిధులను తాను సంక్షేమ పథకాల అమలు కోసం కేటాయించలేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే, భవిష్యత్తులో అవసరమైతే అప్పు చేసైనా పథకాలు అమలు చేస్తానని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారిందని, అందుకే పథకాలు సకాలంలో అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ చెబుతున్నానని అన్నారు. గాడి తప్పిన ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ విషయాల్ని అర్దం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates