ఏపీలోని కూటమి సర్కారు రాష్ట్ర ప్రజలకు సోమవారం శుభ వార్త చెప్పింది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు.
రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతూ ఉంటే.. ప్రజలకు గుడ్ న్యూస్ ఏమిటీ? అంటారా? అయితే… మంత్రి చేసిన ప్రకటన సారాంశంలోకి వెళ్లిపోదాం పదండి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ చార్జీలు ఏకరీతిన ఉన్నాయి. అంటే… పట్టణాలను అలా పక్కనపెడితే… పల్లెల్లో వేల రూపాయల విలువ చేసే భూములను కొనాలంటే కూడా లక్షల మేర రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు రూ.50 వేల విలువ చేసే భూమిని కొనాలంటే…ఏకంగా దానికి ఇతర విలువైన భూముల మాదిరే రూ.80 వేలను రిజిస్ట్రేషన్ చార్జీగా చెల్లించాల్సి వస్తోంది. అంటే… చారాణా కోడికి బారాణా మసాలా అన్నమాట.
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కసరత్తు మొదలైంది. ఈ కసరత్తు నిర్దేశిత సమయానికే పూర్తి అయ్యి ఉంటే… జనవరి 1 నుంచిే భూముల ధరల పెంపు అమల్లోకి వచ్చేది. అయితే భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం వరకే పరిమితం కాని చంద్రబాబు సర్కారు… ఆయా ధరలను హేతుబద్దీకరణ చేసేందుకు పూనుకుంది. అంటే… డిమాండ్ ఉన్న చోట భూముల రేట్లు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయి. అదే సమయంలో డిమాండ్ లేని ప్రాంతాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గుతాయన్న మాట.
ఇదిలా ఉంటే… అమరావతికి పెట్టుబడులతో పాటుగా ప్రపంచ స్థాయి సంస్థలను రాబట్టే ఉద్దేశంతో రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయడం లేదు.అదే సమయంలో డిమాండ్ భారీగా ఉన్న విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ విభిన్న నిర్ణయంతో పల్లెల్లో నిరుపయోగంగా ఉన్న భూములు భారీ స్థాయిలో సాగు వినియోగంలోకి రానున్నాయని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates