వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోమవారం పొద్దుపొద్దునే భారీ ఉపశమనం లభించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న వాదనకు ససేమిరా అన్నది. అంతేకాకుండా జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహంతో స్వయంగా పిటిషనరే ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఈ కేసుల్లో ఎప్పుడెం జరుగుతుందోనన్న ఆందోళనతో సాగుతున్న జగన్ శిబిరం ఈ తీర్పులు విన్నంతనే ఊపిరి పీల్చుకుంది.
ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఎడాపెడా అక్రమార్జనను కూడబెట్టారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాటి ఎమ్మెల్యే శంకర్ రావు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కేసుల ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో జగన్ ను విచారించిన సీబీఐ… ఆయనను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 16 నెలల సుదీర్ఘ జైలు జీవితం అనుభవించిన జగన్… బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ఇప్పటికీ అదే బెయిల్ పై జగన్ బయటే ఉన్నారు.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన కనుమూరి రఘురామకృష్ణరాజు.. ఆ తర్వాత వైసీపీతో, జగన్ తో తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీకి దూరంగా జరిగారు. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసిన నాటి సీఐడీ…. తన కస్టడీలోనే ఆయనను అంతమొందించేందుకు యత్నించిందన్న వార్తలు కలకలం రేపాయి. ఆ తర్వాత జగన్ పై ఓ రేంజిలో ఫైరైపోయిన రఘురామ.. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సిబీఐ, తెలంగాణ హైకోర్టులను ఆశ్రయించారు. రెండు చోట్లా రఘురామ పిటిషన్లకు తిరస్కారమే స్వాగతం పలికింది. దీంతో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామ…జగన్ బెయిల్ ను రద్దు చేయడంతో పాటుగా ఆయన కేసుల విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తాజాగా ఇటీవలే జరిగిన విచారణలో కోర్టు రఘురామ తీరును ప్రశ్నించింది. జగన్ కేసులతో మీకేం సంబంధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా నేటి విచారణలో బాగంగా జగన్ కేసులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న రఘురామ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో కోర్టు తీరును గమనించిన రఘురామ తరఫు న్యాయవాది జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. ఈ రెండు పరిణామాలతో జగన్ శిబిరం ఊపిరి పీల్చుకుంది.