‘ట్రయల్’ కు లోకేశ్ రెడీ!.. సాక్షికి ‘పరువు’ దక్కేనా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పుడు ఓ పెద్ద పోరాటమే చేస్తున్నారు. తన పరువుకు భంగం కలిగేలా కథనాలు రాసిందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఆధ్వర్యంలోని సాక్షి మీడియాను ఆయన ఏకంగా కోర్టుకు లాగిన సంగతి తెలిసిందే. సాక్షిపై లోకేశ్ దాఖలు చేసిన పరువు నష్టం దావా విశాఖలోని ’12వ అదనపు జిల్లా కోర్టులో విచారణ సాగుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ విచారణకు హాజరైన లోకేశ్… తాజాగా సోమవారం జరగనున్న విచారణకూ హాజరవుతున్నారు.

ఈ విచారణ సందర్భంగా లోకేశ్ ను సాక్షి తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా సాక్షి లాయర్లు లోకేశ్ ను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే యత్నం చేశారట. అయితే వారడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చిన లోకేశ్… వారి సహనాన్ని పరీక్షించేలా చేశారట. తాజాగా సోమవారం నాటి క్రాస్ ఎగ్జామినేషన్ కూ లోకేశ్ ఫుల్లుగానే ప్రిపేర్ అయినట్లుగా సమాచారం. అంటే.. ఈ దఫా కూడా సాక్షి లాయర్లకు లోకేశ్ చుక్కలు చూపడం ఖాయమేనని తెలుస్తోంది.

గతంలో మంత్రిగా ఉన్న సమయంలో లోకేశ్ విశాఖ ఎయిర్ పోర్టులో స్నాక్స్ కోసం ప్రజా ధనాన్ని లక్షల మేర దుర్వినియోగం చేశారంటూ సాక్షి పత్రిక ‘చినబాబు చిరుతిండి… 25 లక్షలండి’ పేరిట ఓ కథనాన్ని రాసింది. ఈ కథనంపై నాడు లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనానికి సారీ చెప్పాలంటూ సాక్షికి లోకేశ్ నోటీసులు పంపారు. ఈ నోటీసులకు సాక్షి స్పందించకపోవడంతో లోకేశ్ ఆ సంస్థపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో సాక్షికి గట్టిగా గుణపాఠం చెప్పాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. అందుకే ఈ కేసు విచారణను ఆయన సీరియస్ గా పరిగణిస్తున్నారు.