కాంగ్రెస్ పాలనలో కేవలం ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఆదివారం సాయంత్రం ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం పోస్టు చేశారు. దీనిలో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకే రోజు 4 కీలక పథకాలను ప్రారంభించామన్నారు. ఈ పథకాలు తెలంగాణ పేదలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.
తాజాగా ప్రారంభించిన పథకాల్లో.. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు వంటివి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నవేనని చెప్పారు. “4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం నాలుగు కీలక పథకాలు ప్రారంభించింది. 13 నెలలపాటు పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు పథకాలు ప్రారంభించడం సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.
ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తున్నామని సీఎం చెప్పారు. రైతు భరోసాతోపాటు నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 500లకే ఉచిత సిలిండర్లను అందిస్తూ.. ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీ లను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎంతో మంది పేదలు.. సంవత్సరాల తరబడి.. రేషన్ కార్డుల కోసంఎదురు చూశారని తెలిపారు. రైతు కూలీలు కూడా ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఆదరువు కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.
2004-14 వరకు ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామన్న ఆయన.. నేడు మరోసారి.. పేదల కలలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఈ 13 నెలల కాలంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా లక్షల మంది నిరుద్యోగులకు ఆనందాన్ని కల్పించామన్నారు. ఇదంతా ప్రజలు తమకు కల్పించిన అవకాశమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను అమలు చేయనున్నట్టు వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates