జనసైనికులకు సేనాని కొత్త కట్టుబాట్లు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. టీడీపీ, బీజేపీతో కలిసి పొత్తులో ఉన్న నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన ఆవశ్యకతను పదే పదే ప్రస్తావించిన పవన్… పార్టీ శ్రేణులు పాటించి తీరాల్సిన అంశాలను విస్పష్టంగా వెల్లడించారు. అనవసరం అన్న పదానికి ఆమడ దూరంలో ఉండాలన్న భావన వచ్చేలా పవన్ పేరిట జనసేన జారీ చేసిన ప్రకటన జన సైనికుల్లోనే కాకుండా కూటమి పార్టీల శ్రేణుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల ముందు పరిస్థితిని పవన్ ఈ ప్రకటనలో కూలంకషంగా వివరించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని పూసగుచ్చినట్లు వివరించిన పవన్… ఆ కారణంగానే మూడు పార్టీలతో బరిలోకి దిగిన కూటమిని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని తెలిపారు.

కూటమి పార్టీల గెలుపు శాతం 94 శాతమే అయితే… అందులో జనసేన సక్సెస్ రేటు సెంట్ పర్సెంట్ అన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇంత భారీ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కూటమిలోని అన్ని పార్టీలు కూడా సంయమనంతో వ్యవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.

అయినా జనసైనికులకు పవన్ పెట్టిన కొత్త కండీషన్లు ఏమిటన్న విషయానికి వస్తే… అనవసర వివాదాలు, విభేదాల జోలికి వెళ్లవద్దని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలపై గానీ… కూటమి అంతర్గత విషయాలపై గానీ పొరపాటుగా నాయకులు స్పందించినా..అందుకు ప్రతిస్పందనగా వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చరాదని ఆయన కోరారు.

అంతేకాకుండా ఈ తరహా విషయాలపై బహిరంగ చర్చలు చేయరాదని కూడా ఆయన జనసైనికులను కోరారు. వెరసి కూటమి పటిష్టతకు హానీ చేసే ఏ ఒక్క విషయంపై అసలు స్పందించవద్దని ఆయన పార్టీ శ్రుేణులను కోరారు. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ కట్టుబాట్లకు కట్టుబడాల్సిందేనని కూడా పవన్ పార్టీ శ్రేణులకు సూచించారు.