రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. ఇందుకు ఏ ఒక్క పార్టీల నేతలు మినహాయింపు కాదు. అయితే రిపబ్లిక్ డేను పురస్కరించుకుని అటు కేంద్రంలో రాష్ట్రపతి, ఇటు రాష్ట్రాల్లో గవర్నర్లు ఏర్పాటు చేసే తేనీటి విందు మాత్రంలో నేతల హడావిడి అస్సలు కనిపించదు.
ఎప్పుడూ టెన్షన్ గా కనిపించే నేతల ముఖాలు… ఎట్ హోం కార్యక్రమంలో మాత్రం వెలిగిపోతూ ఉంటాయి. అలా ఉల్లాసంగా సేద దీరుతూ… ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతూ ఉంటారు.
ఆదివారం భారత 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని రాజ్ భవన్ లో ఎట్ హోం పేరిట తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీరజ్ సింగ్ ఠాకూర్, సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారధి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఏపీ సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు సహా చాలా మంది నేతలు, అధికారులు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో బాగంగా ఒకరిని మరొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఎటువంటి బాదర బందీల్లేకుండా ముచ్చట్లలో పడిపోయారు.
వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన పలువురు సాదారణ పౌరులను కూడా గవర్నర్ ఆహ్వానించారు. అలాంటి వారితోనూ నేతలు కలిసిమెలిసి… వారి అనుభవాలను ఆసక్తిగా విన్నారు. మొత్తంగా అన్ని రంగాలకు చెందిన వారి కలయికతో ఎట్ హోం కార్యక్రమం కలర్ ఫుల్ గా సాగింది.