గిఫ్ట్ కార్డుల మోసాలపై పవన్ స్ట్రాంగ్ రియాక్షన్

అమెజాన్ లాంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుంటే… ఏదో కారణం చేత నిర్ణీత గడువలోగా సదరు కార్డులను వినియోగించుకోలేకపోతే… అందులోని మన డబ్బు మాయమైపోయినట్టే. ఈ విషయంపై మనం అడిగితే తప్పించి… ఆయా సంస్థలు మనకు సమాధానం చెప్పవు. ఒకవేళ అడిగినా… అన్ని సంస్థలూ సరైన సమాధానాలు ఇస్తాయన్న గ్యారెంటీ లేదు. వెరసి చాలా మంది వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ తరహా మోసాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం స్పందించారు.

ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్టిట్యూషన్స్ (పీపీఐ)లు ఇకపై నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పవన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఒకవేళ గిఫ్ట్ కార్డుల్లోని మొత్తాలను వినియోగదారులు సకాలంలో వినియోగంచకున్నా కూడా ఆయా మొత్తాలను పీపీఐలు మాయం చేయడానికి వీల్లేదని పవన్ అన్నారు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు నడుచుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన గుర్తు చేశారు. వినియోగం కాని మొత్తాలను వినియోగదారుల ఖాతాల్లోకి జమ చేయాల్సిందేనని పవన్ సూచించారు.

అయినా ఈ గిఫ్ట్ కార్డులపై పవన్ ఎందుకు స్పందించాల్సి వచ్చిందన్న విషయానికి వస్తే.. ఇటీవలి కాలంలో చాలా మంది గిఫ్ట్ కార్డుల్లో మాయమైపోతున్న తమ బ్యాలెన్స్ లపై గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు వినియోగదారులు ఈ విషయాన్ని పవన్ దృస్టికి తీసుకువచ్చారట. దీంతో గతంలో తన కార్యాలయం కూడా అమెజాన్ గిఫ్ట్ కార్డులను వినియోగించిన విషయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా తమ కార్యాలయ గిఫ్ట్ కార్డుల్లోనూ బ్యాలెన్స్ లు మాయమైపోయిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు

 దేశంలో కోట్లాది మంది వినియోగదారులు ఈ గిఫ్ట్ కార్డులను వాడుతున్న విషయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ గిఫ్ట్ కార్డుల సంస్థలు జారీ చేస్తున్న మోసాలపై స్పందించకపోతే దేశ ప్రజలకు నష్టమేనని భావించారు. అంతే…వెనువెంటనే ఈ వ్యవహారంపై ఆయా కంపెనీలు అనుసరిస్తున్న విధి విధానాలను అధికారులతో అడిగి తెలుసుకున్న పవన్.. ఆయా సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డులు, వాటిలోని బ్యాలెన్స్ ల గడువు, గడువు తీరిన తర్వాత ఆయా సంస్థలు సదరు బ్యాలెన్స్ లను ఏం చేస్తున్నాయన్న దానిపై ఆరా తీసిన తర్వాత పవన్ స్పందించారు.