మోడీ-ప‌ద్మాలు: ఉద్య‌మాల‌కు ఊపిరా.. ఉద్య‌మ ఓట్ల‌కు ఊపిరా?!

‘ప‌ద్మ శ్రీ’ వంటి ప్ర‌తిష్టాత్మ‌క పౌర స‌న్మానాలు అంద‌రికీ ద‌క్క‌వు. దీనికి ఎంతో పెట్టిపుట్టి ఉండాల‌న్న చ‌ర్చ నుంచి నేడు .. పీపుల్స్ ప‌ద్మ‌ పేరుతో మ‌ట్టిలో మాణిక్యాల‌ను ప్ర‌జ‌లే ఎంపిక చేసుకుని పుర‌స్కారాలు కట్ట బెట్టే దిశ‌గా కేంద్రానికి సిఫార‌సు చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ప‌లువురు ప్ర‌ముఖులు ప‌ద్మ‌శ్రీ అవార్డుకు ఎంపిక‌య్యారు. వీరిలో ప్ర‌ముఖ ఉద్య‌మకారుడు.. మాదిగ సామాజిక వ‌ర్గం హ‌క్కుల కోసం.. పోరాటం స‌ల్పుతున్న మంద కృష్ణ‌కు ద‌క్క‌డం ముదావ‌హ‌మే!

సుదీర్ఘ పోరాటాలు కృష్ణ‌కు సొంతం. ఆయ‌న ఎంచుకున్న మార్గంలో రాజీ లేని ధోర‌ణిని మ‌నం స్ఫ‌ష్టంగా గ‌మ‌నించే ప్ర‌య‌త్నం చేయొచ్చు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు ప‌ట్టుబ‌ట్టి రాష్ట్ర డిమాండ్‌ను దేశ‌వ్యాప్తం చేయ‌డం.. అనంత‌రం… దీనిని సాధించే దిశగా న్యాయ‌పోరాటం స‌ల్ప‌డం కూడా..మంద కృష్ణ కృషిని అభినందించే లా చేసింద‌న‌డంలో సందేహం లేదు. సో.. ఉద్య‌మ బాట‌సారిగా ఆయ‌న‌లోని స్ఫూర్తి మంత‌మైన చైత‌న్యా న్ని గుర్తించిన కేంద్రం ప‌ద్మ అవార్డును ప్ర‌క‌టించింది.

ఈ స‌మ‌యంలో రాజ‌కీయాలు త‌గ‌వు. ఇది వాస్త‌వం. కానీ, ప‌ద్మ అవార్డు ప్ర‌క‌ట‌న‌.. దీని వెనుక ఉన్న నేపథ్యం వంటి వాటిని గ‌మ‌నిస్తే.. ఉద్మ‌మాల‌కు ఊపిరి ఊద‌డం వ‌ర‌కు ఎవ‌రూ కాద‌న‌రు. అవ‌స‌రం కూడా. అయితే.. నిజ‌మైన ఉద్య‌మాలకు ప్ర‌తీక‌లుగా నిలిచిన వారు మంద కృష్ణ‌తో పాటు చాలా మంది ఉన్నారు. కానీ, వారిప్ప‌టికీ పుర‌స్కారాల‌కు ఆమ‌డ దూరంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. న‌ర్మదా బ‌చావో ఆందోళ‌న చేప‌ట్టిన మేథా పాట్క‌ర్‌.. దేశ‌వ్యాప్తంగా న‌దుల ప‌రిర‌క్ష‌ణ‌ను చాటి చెప్పారు.

న‌ర్మ‌దాన‌ది ర‌క్ష‌ణే కాకుండా.. సామాజిక విప్ల‌వాల‌కు కూడా.. మేధా పాట్క‌ర్ ఎంతో కృషి చేశారు. ఇక‌, సైనిక అధికారాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేసి.. రాష్ట్రంలో మ‌హిళ‌లు, చిన్నారుల హ‌క్కుల కోసం.. ఏళ్ల త‌ర‌బ‌డి నిరాహార దీక్ష చేసిన మ‌ణిపూర్ మ‌హిళ ఇరోమ్ ష‌ర్మిల కూడా.. పుర‌స్కారానికి అర్హులే. కానీ, వీరికి ఓటు బ్యాంకు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అలాగ‌ని ప‌ద్మాలు పొందిన వారంతా ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేస్తార‌ని కాదు.. కానీ,… కొన్ని కొన్ని మాత్రం యాదృచ్ఛికంగా జ‌రిగిపోతుంటాయి అంతే!!

ఇక‌, కృష్ణ మాదిగ విష‌యానికి వ‌స్తే.. ఉద్య‌మ నేప‌థ్యంతోపాటు.. బ‌ల‌మైన ఎస్సీ ఓటు బ్యాంకును కూడా క‌దిలించ‌గ‌ల శ‌క్తి ఉన్న నాయ‌కుడిగా కూడా పేరుంది. ద‌క్షిణాదిలో క‌మ‌ల వికాసం కోసం.. త‌పిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఆ దిశ‌గా మ‌రిన్ని అడుగులు వేసే అవ‌కాశం ఉంద‌ని భావించే వారు పెరుగుతున్నారు. సో.. మొత్తానికి మోడీ ప‌ద్మాలు.. ఉద్య‌మాల‌కు ఊపిరులూదాయ‌ని అనుకోవ‌డం త‌ప్పుకాక‌పోయినా.. దాని వెనుక ఉద్య‌మ ఓటు బ్యాంకు కూడా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.