ఓ సీఎం ప్రెస్ మీట్ అంటే.. లెక్కలేనన్ని టీవీ, యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లు, ప్రింట్ మీడియా… ఆయా సంస్థలకు చెందిన జర్నలిస్టులతో పాటు వీడియో, ఫొటో జర్నలిస్టులను లెక్కలోకి తీసుకుంటే.. వందల మందే ఉంటారు. జర్నలిస్టులను అలా పక్కనపెడితే వీడియో, ఫొటో జర్నలిస్టుల సందడి గోలను తరలిస్తుంది. అయితే నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రెస్ మీట్ లో అసలు ఆ గోలే కనిపించలేదు. అంతేకాదండోయ్.. అసలు అక్కడ వీడియో, ఫొటో జర్నలిస్టులే కనిపించలేదు. వీడియో కెమెరాలు గానీ, ఫొటో కెమెరాలు గానీ కనిపించలేదు.
అదేంటీ… చంద్రబాబు ప్రెస్ మీట్ ను టీవీ ఛానెళ్లతో పాటు సోషల్ మీడియాలో కూడా లైవ్ గా ప్రసారమైంది కదా అంటారా? వీడియో కెమెరాలు లేకుండా అదెలా సాధ్యమైంది అంటారా? టెక్నాలజీని వినియోగించడంలో ఆరితేరిన చంద్రబాబు లాంటి వారికి ఇది సాధ్యమే అవుతుంది. నిన్నటి ప్రెస్ మీట్ లో చంద్రబాబు… వీడియో, ఫొటో కెమెరాలను అలా బయటపెట్టేసి… ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఓ నాలుగు స్టిల్డ్ కెమెరాలతో పని కానిచ్చేశారు. వీడియో గ్రాఫర్ల ద్వారా జరిగే లైవ్ స్ట్రీమింగ్ కంటే కూడా మెరుగైన స్ట్రీమ్ ను జనం ఎంజాయ్ చేశారు.
అంటే… చంద్రబాబు మార్కు టెక్నాలజీ వినియోగంతో వీడియో, ఫొటో కెమెరాలను చెల్లుచీటి పడిపోయిందన్న మాట. అంతేనా… జాతరను తలపించే ప్రెస్ మీట్ కాస్తా అతి కొద్ది మంది జర్నలిస్టుల సమక్షంలో ప్రశాంతంగా సాగింది. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండగా ఐటీని కలవరించిన చంద్రబాబు..ఇప్పుడు ఏఐని కలవరిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని ఏఐ కేపిటల్ గా మారుస్తామని కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా ఆయనే తొలి అడుగులు వేస్తున్నారన్న మాట.
ఇక నిన్నటి ప్రెస్ మీట్ లో ఏఐని బాబు ఎలా వినియోగించారన్న విషయానికి వస్తే.. చంద్రబాబు అధికారిక నివాసంలోని సమావేశ మందిరంలో ఏఐ ఆధారిత షూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ కోసం సర్కారీ నిధులను వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా… అందుకు ససేమిరా అన్న మంత్రి నారాలోకేశ్… తన తండ్రి నివాసంలో తన సొంత నిధులతో ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలో మీటింగ్ హాల్ లో అన్ని దిశలను కవర్ చేసేలా నాలుగు వీడియో కెమెరాలు ఏర్పాటయ్యాయి. అవే అన్ని యాంగిళ్లను వీడియో తీస్తూ ఉంటాయి. వాటి వచ్చే అందే ఫీడ్ లో మనకు ఏది కావాలనుకుంటే…ఆ వీడియో స్ట్రీమ్ ను లైవ్ టెలికాస్ట్ చేయొచ్చు.
నిన్నటి మీడియా సమావేశం కోసం చంద్రబాబు మీటింగ్ హాల్ లోకి రాగానే… వాయిస్ మెసేజ్ ద్వారా కెమెరాలకు సందేశం వెళ్లగానే.,. అవి ఆన్ అయిపోయాయి. ఓ కెమెరా చంద్రబాబును ఫోకస్ చేస్తూ సాగగా…మిగిలిన కెమెరాలు గదిలోని అన్ని యాంగిళ్లను కవర్ చేశాయి. ఈ నాలుగు కెమెరాల నుంచి ఫీడ్ తీసుకున్న ఓ టెక్నీషియన్ ఎంపిక చేసిన ఫీడ్ ను టెలికాస్ట్ చేశారు. అంటే… కేవలం ఒకే ఒక్క వ్యక్తి ద్వారా ప్రెస్ మీట్ లైవ్ ను, వీడియో కవరేజ్ ను మేనేజ్ చేశారు. వెరసి ప్రజల ధనం వృధా కాకుండా చేయడంతో పాటుగా పీస్ ఫుల్ గా ప్రెస్ మీట్ ను చంద్రబాబు పూర్తి చేశారు. ఎంతైనా టెక్నాలజీ వినియోగంలో బాబును మించిన వాడు లేడని ఈ ఘటన రుజువు చేసింది.